matadipathi
-
లింగాయత్ మఠాధిపతికి గుండెపోటు
-
జూలైలో మఠాధిపతుల భేటీ
సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొలిక్కి రాకపోవడంతో.. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని పరిష్కరించేందుకు దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. తదుపరి మఠాధిపతి ఎంపిక కోసం జూలై నెలాఖరులో సమావేశం నిర్వహించబోతోంది. దీనికి వివిధ మఠాధిపతులు విచ్చేసి.. కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. వారితో చర్చించిన అనంతరం మఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ సమావేశం నిర్వహణ కోసం జాయింట్ కమిషనర్ ఆజాద్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత సమస్యను పరిష్కరించాలంటే నిబంధనల ప్రకారం.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలను అనుసరించే దేవదాయ శాఖ పరిధిలోని మఠాధిపతులతోనే సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దేవదాయ శాఖ పరిధిలో 128 మఠాలున్నాయి. ఇందులో 13.. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాల ప్రకారం పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అవకాశాన్ని బట్టి ఆ 13 మంది మఠాధిపతులు గానీ.. లేదంటే అందులో ఐదుగురు గానీ.. కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. ఇందులో వచ్చే అభిప్రాయం మేరకు మఠాధిపతిని ఎంపిక చేస్తారు. ఈ సమావేశాన్ని బ్రహ్మం గారి మఠంలో గానీ లేదంటే కడప, విజయవాడలో గానీ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. 30 రోజుల ముందస్తు నోటీసుతో.. ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం.. సమావేశం నిర్వహణ కోసం 30 రోజుల ముందు ఆయా మఠాధిపతులతో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు çసమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి ఆజాద్ ఒకటి, రెండు రోజుల్లో బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించి రికార్డులు పరిశీలిస్తారు. అనంతరం మఠాధిపతుల సమావేశం ఏర్పాటుకు ఈ నెల 28, 29 తేదీల్లో మీడియా ప్రకటన రూపంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆ మీడియా నోటిఫికేషన్ జారీ అనంతరం 30 రోజులకు సమావేశం నిర్వహిస్తారు. చదవండి: మన పిల్లలకు హైఎండ్ స్కిల్స్ నేర్పించాలి -
బ్రహ్మంగారి మఠం: తెగని పంచాయితీ, చర్చలు విఫలం
సాక్షి, వైఎస్సార్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపత్యం వివాదంలో జరపుతున్న చర్చలు విఫలమయ్యాయి. శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి రెండు కుటుంబాల మధ్య ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. పీఠాధిపత్యం విషయంలో చర్చలు కొలిక్కిరావడం లేదు. మఠం పీఠాధిపతి పదవికి తానే అర్హుడని వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి పట్టుడుతుండగా.. తనను మఠం మాతృశ్రీగా నియమించాలన్న రెండో భార్య మహాలక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. వీరితోపాటు తనకూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి అంటున్నాడు. ఇదిలా ఉండగా డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. నేనంటే.. నేనే వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి(53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి(9)ల మధ్య పీఠాధిపత్యంలో పోటీ నెలకొంది. గోవిందస్వామి మేజర్ అయ్యేంత వరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి రావడం వివాదం నెలకొంది. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. చదవండి: శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యం కోసం ఇరువర్గాల పోరు -
ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!
సాక్షి ప్రతినిధి, కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు నెలకొంది. డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. మఠం పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10 కోట్లు విలువజేసే 84.24 ఎకరాల భూములున్నాయి. వీటిపై వచ్చే కౌలుతోపాటు దేవస్థానం పరిధిలోని వివిధ దుకాణాల కోసం కేటాయించిన గదుల ద్వారా ఏటా మఠానికి సుమారు రూ.4 కోట్ల మేర రాబడి వస్తున్నట్లు చూపిస్తున్నా వాస్తవానికి రెట్టింపు రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం, ఆ మొత్తాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేసే అధికారాలు ఉండడంతో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపత్యం కోసం పోటీ ఏర్పడింది. మఠానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు పంపుతుంటారు. వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడైన గాలి జనార్దన్‌రెడ్డి మఠం అభివృద్ధికి డబ్బులు వెచ్చించి సొంతంగా పలు భవనాలు కట్టించారు. ఇద్దరూ.. ఇద్దరే శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి మొదటి భార్య కుమారుడితోపాటు రెండో భార్య మారుతి మహాలక్షుమ్మలు మఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ సిద్ధపడుతున్నారు. ఇద్దరికీ స్థానిక నేతలతోపాటు బంధుగణం, సన్నిహితులు మద్దతు పలుకుతూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. ఆమెది నిరుపేద కుటుంబం. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. స్వయం ప్రతిపత్తితో.. మఠం స్వయం ప్రతిపత్తితో నడుస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మఠాధిపతులు నచ్చినట్లుగా ఖర్చు చేయవచ్చు. ఏడాదికి ఒకసారి రాబడి, ఖర్చులను దేవదాయశాఖకు వెల్లడించాలి. మఠం పరిధిలో 46 మంది ఉద్యోగులు ఉండగా జీతాల కింద నెలకు రూ.6 లక్షలు ఖర్చవుతోంది. మఠాధిపతికి నెలకు రూ. 40 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. బ్రహ్మంగారి ఆరాధన, మహా శివరాత్రి, బ్రహ్మంగారి జయంతి, దసరా ఉత్సవాల కోసం ఏటా రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా రాబడిలో దేవదాయశాఖకు కాంట్రిబ్యూషన్ కింద 8 శాతం, ఆడిటింగ్ ఫీజు 1.05 శాతం, సీజీఎఫ్ 9 శాతం, అర్చక వెల్ఫేర్ 8 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. మఠం స్థిరాస్తుల వివరాలు – కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని కేతారంలో 50 సెంట్లు – గుంటూరు జిల్లా ఎల్లలూరులో 50 సెంట్లు, నగరంలో 1.10 ఎకరాలు, కంతేరులో 1.16 ఎకరాలు – ప్రకాశం జిల్లా రెడ్డిచర్లలో 16 సెంట్లు, పల్లెగుట్టపల్లెలో 6.43 ఎకరాలు – అనంతపురం జిల్లా చలివెందులలో 27 సెంట్లు – వైఎస్సార్ జిల్లా సోమిరెడ్డిపల్లెలో 18 ఎకరాలు, చీపాడులో 2.26 ఎకరాలు, పెద్ద గురవలూరులో 1.18 ఎకరాలు, మడూరులో 2.96 ఎకరాలు, వాసుదేవపురంలో 68 సెంట్లు, ఉప్పరపల్లెలో 1.19 ఎకరాలు, రంగాపురంలో 10.57 ఎకరాలు, దుంపలగట్టులో 1.93 ఎకరాలు, నందిపల్లెలో 1.93 ఎకరాలు, చెన్నూరు ఉప్పరపల్లెలో 50 సెంట్లు, పెద్దపుత్తలో 78 సెంట్లు, పైడికాల్వలో 60 సెంట్లు, బుగ్గరాపురంలో ఒక ఎకరా, సంకటితిమ్మాయపల్లెలో 2.24 ఎకరాలు. – కర్నూలు జిల్లా నరసాపురంలో 4.57 ఎకరాలు, ఆలమూరులో 7.60 ఎకరాలు – కర్నూలు జిల్లాలోని భూములతోపాటు వైఎస్సార్ జిల్లా శోస్తి వెంగన్నపల్లెలో 1.10 ఎకరాల భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి. బంగారం, వెండి, ఎఫ్డీలు – మఠం పరిధిలో 3.20 కిలోల బంగారం, 142 కిలోల వెండి ఉంది. – దుకాణాల బాడుగలపై ఏటా రూ. 6 లక్షల ఆదాయం – పలు బ్యాంకుల్లో రూ. 12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు – తలనీలాలు, హుండీ ఆదాయం, టెంకాయల వేలం ద్వారా రాబడి -
వీలునామాలకు ఆస్కారంలేదు
బ్రహ్మంగారి మఠం: బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారంలేదని ఆయన తేల్చిచెప్పారు. ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తామన్నారు. మఠాధిపతి మృతిపై అనుమానాలు ఇదిలా ఉంటే.. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
పల్నాటి పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక..
ఒక వైపు పల్నాటి వీరారాధనోత్సవాల ఏర్పాట్లు.. మరో వైపు అనారోగ్యానికి గురైన తల్లి.. అడుగడుగునా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు.. ఇదీ పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ పరిస్థితి. పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక, వైద్య ఖర్చులకు నగదు అందుబాటులో లేక తల్లడిల్లుతున్నారు. పల్నాటి వీరుల ఆత్మశాంతి కోసం తపించే అతని కుటుంబానికి ప్రస్తుతం మనశ్శాంతి కరవైంది. సాక్షి, కారంపూడి(మాచర్ల): పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ మాతృమూర్తి సరస్వతికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు భర్త, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చారు. అయితే ఆ కిడ్నీతో జరిగిన ఆపరేషన్ విఫలమైంది. దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తోంది. కిడ్నీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌కుమార్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. పల్నాటి వీరారాధనోత్సవాల నిర్వహణకు కోవిడ్ వల్ల ఇబ్బందులు రావడం దీనికి మరింత తోడైంది. పీఠాధిపతి తల్లయినా.. విజయ్‌కుమార్, సరస్వతి దంపతులకు ముగ్గురు సంతానం. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తొలి సంతానం. ఆయన డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. పెద్ద కుమార్తె తులసీ ప్రియాంక బీటెక్, చిన్న కుమార్తె కావ్య ఇంటర్ చదువుతున్నారు. కుటుంబ పోషణ కోసం సరస్వతి కూడా కారంపూడిలో సేవా సంస్థ నడుపుతున్న స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటికొచ్చిన ఆచారవంతులను సరస్వతి చాలా బాగా చూసుకునేవారు. ఆచారవంతుల్లో పేదలుంటే వారందరికీ తనే భోజనం చేయించి ఉత్సవాలలో వడ్డించేవారు. ఇబ్బందులతో ఉమ్మడి కుటుంబం నడక.. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవది ఉమ్మడి కుటుంబం. తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారి ఇంటి కింది భాగంలో మూడు షాపులపై ఏడాదికి వచ్చే రూ.1.20 లక్షలే వారికి జీవనాధారం. ఉత్సవాలప్పుడు వీరాచారవంతులు ఇచ్చే కానుకలు కొంత ఆదుకుంటున్నాయి. అద్దెలు, కానుకలు చాలక విజయ్‌కుమార్ సోదరి విష్ణు, సరస్వతి ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్నారు. పాత ఇల్లు పడేసి, షాపులతో కూడిన ఇల్లు నిర్మించకముందు ఉత్సవాల నిర్వహణకు పీఠాధిపతి పిడుగు ఆంజనేయశివప్రసాద్ ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు చేయడానికి ఉన్నత చదువు చదువుకున్న ఆయనకు ఇతరులను సాయం అడగడానికి ప్రాణం ఒప్పలేదు. అప్పట్లో ఆయన మిత్రులుగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ఒక జర్నలిస్టుతో కలసి పులిహోర చేయించి దానితోనే సంప్రదాయాన్ని నెరవేర్చారు. ఆంజనేయశివప్రసాద్కు సంతానం లేకపోవడంతో అప్పట్లో తరుణ్చెన్నకేశవను దత్తత తీసుకున్నారు. ఆయన గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఏడేళ్ల వయస్సు నుంచి తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతిగా ఉత్సవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కేశవానంద భారతి కన్నుమూత
కాసరగఢ్ (కేరళ): రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుముశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేశవానంద భారతి మృతి సమాచారం తెలుసుకుని భారీగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు ఎదనీరు మఠంలో ఆయన మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. ‘ఎదనీరు మఠాధిపతి కేశవానంద భారతి తత్వవేత్త. శాస్త్రీయ సంగీతకారుడు. యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం వెలువరించారు. ‘సమాజ సేవలో పూజ్య కేశవానంద భారతి చేసిన సేవలు స్మరణీయం. పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన గొప్ప కృషి చేశారు’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మైలురాయి... ఆ తీర్పు కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం. ఆ తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. ‘రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. అందుకే ఈ కేసుకు అంత ప్రాముఖ్యత నెలకొంది’అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు పేర్కొన్నారు. భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక. -
శిష్యుడిపై గురువుదే విజయం
⇒ కాశీ మఠం మఠాధిపతి సుధీంద్ర తీర్థ స్వామే ⇒ ఆ స్థానాన్ని ఆయన పరిత్యజించలేదు ⇒ తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు ⇒ రాఘవేంద్ర తీర్థ స్వామి అప్పీళ్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన మఠాల్లో ఒకటైన కాశీ మఠం, బెనారస్ మఠాధిపతి విషయంలో జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో శిష్యుడిపై గురువు విజయం సాధించారు. కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా శ్రీమధ్ సుధీంద్ర తీర్థ స్వామే కొనసాగుతారని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. మఠాధిపతి స్థానాన్ని ఆయన పరిత్యజించలేదని తెలిపింది. తాను కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా నియమితులయ్యానంటూ సుధీంద్ర స్వామి శిష్యుడు శ్రీమధ్ రాఘవేంద్ర తీర్థ స్వామి చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని రుజువు చేసేందుకు రాఘవేంద్ర తీర్థ స్వామి ఎటువంటి ఆధారాలు చూపలేదని తేల్చిచెప్పింది. ఇదేసమయంలో మఠాధిపతి స్థానాన్ని తాను పరిత్యజించలేదని సుధీంద్ర స్వామి రుజువు చేయగలిగారని తెలిపింది. ఇందుకు సంబంధించి కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాఘవేంద్ర తీర్థ స్వామి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని, దీంతో ఆయన శిష్యుడిగా తాను మఠాధిపతినయ్యానంటూ రాఘవేంద్ర స్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మఠం వ్యవహారాల్లో సుధీంద్ర స్వామితోసహా ఇతరులెవ్వరినీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తిరుపతి కోర్టులో 2000 సంవత్సరంలో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు రాఘవేంద్రస్వామి పిటిషన్‌ను 2009లో కొట్టేసింది. దీనిపై ఆయన అదేఏడాది హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాచారాల ప్రకారం మఠాధిపతి మహాసమాధి అయ్యాకనే ఆయన వారసుడిని మఠాధిపతిగా నియమిస్తారని జస్టిస్ నాగార్జునరెడ్డి తన 34 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సుధీంద్ర స్వామి కేవలం పాలన వ్యవహారాలు, ఇతర దైవిక వ్యవహారాల బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని గుర్తుచేశారు. మఠాధిపతిగా కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించడానికీ, మఠాధిపతి స్థానాన్ని పరిత్యజించడానికీ తేడా ఉందన్నారు. కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించాక కూడా మఠపెద్దగా మఠాధిపతి స్థానంలో కొనసాగేందుకు సుధీంద్ర స్వామికి అధికారముందని తేల్చారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓ మఠానికి చెందిన మఠాధిపతి శిష్యుడు గద్దెకోసం తన గురువునే వివాదంలోకి లాగారు. కింది కోర్టులో చుక్కెదురైనా తను అనుకున్నది పొందేందుకు హైకోర్టును ఆశ్రయించారు. తన గురువుపైనే ఈ సన్యాసి చేస్తున్న న్యాయపోరాటాన్ని చూస్తుంటే, ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణ వ్యక్తులవలే ఉన్నత స్థానాలకోసం వెంపర్లాడుతారా? అని ఆశ్చర్యం కలుగుతోంది. - జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి