పల్నాటి పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక.. | Palnati Tarun Chennakeshava Mother Serious Kidney Problems | Sakshi
Sakshi News home page

పల్నాటి పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక..

Published Thu, Dec 3 2020 8:50 AM | Last Updated on Thu, Dec 3 2020 8:50 AM

Palnati Tarun Chennakeshava Mother Serious Kidney Problems - Sakshi

గతేడాది ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ విప్‌ పీఆర్కేతో పీఠాధిపతి తరుణ్‌చెన్నకేశవ, పీఠాధిపతి తల్లి సరస్వతి

ఒక వైపు పల్నాటి వీరారాధనోత్సవాల ఏర్పాట్లు.. మరో వైపు అనారోగ్యానికి గురైన తల్లి.. అడుగడుగునా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు.. ఇదీ పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ పరిస్థితి. పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక, వైద్య ఖర్చులకు నగదు అందుబాటులో లేక తల్లడిల్లుతున్నారు. పల్నాటి వీరుల ఆత్మశాంతి కోసం తపించే అతని కుటుంబానికి ప్రస్తుతం మనశ్శాంతి కరవైంది.

సాక్షి, కారంపూడి(మాచర్ల): పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ మాతృమూర్తి సరస్వతికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు భర్త, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చారు. అయితే ఆ కిడ్నీతో జరిగిన ఆపరేషన్‌ విఫలమైంది. దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించాల్సి వస్తోంది. కిడ్నీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌కుమార్‌ ఆరోగ్యం కూడా దెబ్బతింది. పల్నాటి వీరారాధనోత్సవాల  నిర్వహణకు కోవిడ్‌ వల్ల ఇబ్బందులు రావడం దీనికి మరింత తోడైంది.

పీఠాధిపతి తల్లయినా..  
విజయ్‌కుమార్, సరస్వతి దంపతులకు ముగ్గురు సంతానం. పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ తొలి సంతానం. ఆయన డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. పెద్ద కుమార్తె తులసీ ప్రియాంక బీటెక్, చిన్న కుమార్తె కావ్య ఇంటర్‌ చదువుతున్నారు. కుటుంబ పోషణ కోసం సరస్వతి కూడా కారంపూడిలో సేవా సంస్థ నడుపుతున్న స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటికొచ్చిన ఆచారవంతులను సరస్వతి చాలా బాగా చూసుకునేవారు. ఆచారవంతుల్లో పేదలుంటే వారందరికీ తనే భోజనం చేయించి ఉత్సవాలలో వడ్డించేవారు.
 
ఇబ్బందులతో ఉమ్మడి కుటుంబం నడక.. 
పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవది ఉమ్మడి కుటుంబం. తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారి ఇంటి కింది భాగంలో మూడు షాపులపై ఏడాదికి వచ్చే రూ.1.20 లక్షలే వారికి జీవనాధారం. ఉత్సవాలప్పుడు వీరాచారవంతులు ఇచ్చే కానుకలు కొంత ఆదుకుంటున్నాయి. అద్దెలు, కానుకలు చాలక విజయ్‌కుమార్‌ సోదరి విష్ణు, సరస్వతి ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్నారు. పాత ఇల్లు పడేసి, షాపులతో కూడిన ఇల్లు నిర్మించకముందు ఉత్సవాల నిర్వహణకు పీఠాధిపతి పిడుగు ఆంజనేయశివప్రసాద్‌ ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు చేయడానికి ఉన్నత చదువు చదువుకున్న ఆయనకు ఇతరులను సాయం అడగడానికి ప్రాణం ఒప్పలేదు.

అప్పట్లో ఆయన మిత్రులుగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ఒక జర్నలిస్టుతో కలసి పులిహోర చేయించి దానితోనే సంప్రదాయాన్ని నెరవేర్చారు. ఆంజనేయశివప్రసాద్‌కు సంతానం లేకపోవడంతో అప్పట్లో తరుణ్‌చెన్నకేశవను దత్తత తీసుకున్నారు. ఆయన గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఏడేళ్ల వయస్సు నుంచి తరుణ్‌ చెన్నకేశవ పీఠాధిపతిగా ఉత్సవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement