దేవుడా..! నువ్వే దిక్కు
* హైరిస్క్ కేంద్రాలున్నా ఫలితం సున్నా
* ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళల ప్రసవ వేదన
సంగారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా, శిశు హైరిస్క్ ప్రసూతి కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రసవం కోసం వస్తున్న మహిళలకు నరకయాతన తప్పడం లేదు. మాతా, శిశు మరణాలను తగ్గించడం, రక్త హీనత, ఇతర సమస్యలతో బాధపడే గర్భిణులకు సుఖ ప్రసవం జరిపించాలన్న ఉద్దేశంతో గత కలెక్టర్ స్మితా సబర్వాల్ ఈ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని మెదక్, సిద్దిపేట, పటాన్చెరు, జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే హైరిస్క్ కేంద్రం లేకపోవడం విచారకరం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎన్ని కల్పించిన ప్పటికీ వైద్యులు, సిబ్బందిలో అంకితభావం లోపించడం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెదక్ మండలం హవేళి ఘన్పూర్ గ్రామానికి చెందిన రవి భార్య శేఖమ్మ ఆదివారం మెదక్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సహకారం లభించకపోవడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది.
ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఆమె మార్గంమధ్యలోనే జోగిపేట సమీపంలో ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్లు ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి శేఖమ్మను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు మానవత్వాన్ని ప్రదర్శించడం వల్లే తల్లీబిడ్డలు క్షేమంగా బయట పడ్డారు. ఈ పాటి విజ్ఞతను మెదక్‌లోగానీ, సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్యులు చూపించి ఉంటే శేఖమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించి ఉండేది.
హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటయ్యేనా?
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసూతి కోసం వచ్చిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖ ప్రసవం పొందేందుకు హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు గత కలెక్టర్ స్మితా సబర్వాల్ పూనుకున్నారు. ప్రతినెలా 30 వరకు కాన్పులు జరిగే ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని త లిచారు. ప్రభుత్వ ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చే మహిళలు సుఖ ప్రసవం పొంది ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు ఈ హెల్ప్‌డెస్క్‌లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షించాలని ఆమె భావించారు.
గర్భిణులకు గానీ, బిడ్డకుగానీ పరిస్థితి ఆందోళకరంగా ఉంటే ఆమెను హైదరాబాద్‌కు తరలించైనా సరే డెలివరీ చేయించాల్సి ఉంటుంది. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు వరం లాంటిది. హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు ఒక్కింటికి రూ. 80 వేలు ఎన్ఆర్హెచ్ఎం కింద ఖర్చు చేయాలని భావించారు. కానీ స్మితా సబర్వాల్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ కార్యాచరణ అంతా కాగితాలకే పరిమితమైంది. తర్వాత ఇన్చార్జ్గా ఉన్న జేసీ శరత్, కొత్తగా వచ్చిన రాహుల్ బొజ్జాలు ఈ విషయంలో దృష్టి సారించక పోయారు.
ఇటీవల సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య సైతం సంగారెడ్డి ఆస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కానీ హెల్ప్‌డెస్క్‌ల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోవడం, ఖర్చులు ఎక్కడి నుంచి వినియోగించాలో తేలకపోవడంతో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు కాలేదు. ఒకవేళ హెల్ప్‌డెస్క్ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి ఉంటే మెదక్ మండలం హవేళి ఘన్‌పూర్‌కు చెందిన గర్భిణికి ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు జరిగేది.