Mathampalli
-
రాష్ట్రంలో తుగ్లక్ పాలన చూస్తున్నాం: కిషన్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట : ఎప్పుడు చూడని తుగ్లక్ పాలన ఇప్పుడు చూస్తున్నామని.. కేసీఆర్ ఓ పిచ్చి తుగ్లక్ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మఠంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అభ్యర్ధి కోట రామారావును గెలిపించాలని కోరారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని.. కేసీఆర్ నియంతలా మారి నిరంకుశ పాలన చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో హక్కుల గురించి అడిగే హక్కు ఏ సంఘాలకు లేకుండా కేసీఆర్ చేశారన్నారు. హుజూర్నగర్ నియోజక వర్గంలో ఉన్న 14 సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఏడాదికి వచ్చే రూ. 300 కోట్లు.. ఈ ప్రాంతానికి ఖర్చు చేయట్లేదని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ నిజాం పాలన చేస్తున్నారని, 50 వేల ఆర్టీసీ ఉద్యోగులను తొలిగించింన ఘనత కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాలు లేవని.. ఉన్న ఉద్యోగాలను కేసీఆర్ తొలగిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ ఇస్తానన్న.. డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ ఎక్కడా అని ప్రశ్నించారు. మహిళ సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని కేసీఆర్ తీరును ఎండగట్టారు. ఉప ఎన్నికతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని మంత్రి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. 2023లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మునిగిన నావ ఉత్తమ్ హుజూర్‌నగర్‌కు చేసిందేమి లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్లో గెలిచినా.. ప్రయోజనం ఉండబోదనీ, కాంగ్రెస్ మునిగిన నావ అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో 19 సీట్లు గెలిస్తే.. అందులో 13 మంది టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ, దేశంలో.. ఉత్తమ్, రాహుల్ గాంధీ కాలం చెల్లిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి!
మఠంపల్లి : మోడల్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి.. మీరు బీసీలు, ఎస్టీలు కాబట్టి... మీకు దరఖాస్తు రుసుం కూడా ఉండదన్నారు... విద్యార్థులందరి దగ్గరి నుంచి దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలన్నీ తీసుకున్నారు... మేం దరఖాస్తు చేసేశాం.. మీరు వెళ్లి పరీక్ష రాయొచ్చని చెప్పారు... తీరా చూస్తే ఆ పరీక్ష రేపు అనగా ఇప్పుడు హాల్‌టికెట్లు రాలేదు... మీ ధ్రువపత్రాలు అప్లోడ్ కాదని చెప్పి చేతులు దులుపుకోవడంతో జిల్లాలోని మఠంపల్లి మండలానికి చెందిన 15 మంది విద్యార్థులు పాలీసెట్ - 2016 రాసే అర్హత కోల్పోయూరు. విద్యార్థులు చదువుకుంటున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు, తనకు పరిచయస్తుడైన కోదాడలోని ఓ కళాశాల ప్రతినిధి ఇద్దరూ కలిసి చేసిన నిర్వాకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్తాపానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా మఠంపల్లిలోని మోడల్‌స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో ఈ ఏడాది 69 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యనభ్యసించారు. పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ సలహాతో సుమారు 15 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు చేసుకునే వారు బీసీ, ఎస్టీలు కాబట్టి దరఖాస్తు రుసుం లేకుండానే అప్లయ్ చేస్తామని... సీట్లు వస్తే మా కళాశాలలోనే తక్కువ ఫీజుకు పాలిటెక్నిక్‌లో చేర్చుకుంటామని చెప్పి ఈ దరఖాస్తులను జాకీర్‌హుస్సేన్‌కు పరిచయస్తుడైన కోదాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి కె.శ్రీనివాస్‌కు అందజేశారు. దీంతో దరఖాస్తులు చేసుకున్నాం కదా... అని రేయింబవళ్లు చదివి విద్యార్థులు పరీక్షకు సంసిద్ధులయ్యారు. ఈలోగా ఈనెల 21న పాలిటెక్నిక్ అర్హత పరీక్ష జరగనుండటంతో హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్లో ప్రయత్నించారు. అయితే మో డల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క విద్యార్థికి కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ఆందోళన చెంది ఉపాధ్యాయుడిని సంప్రదించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి శ్రీనివాస్‌ను సంప్రదించగా మోడల్ స్కూల్ విద్యార్థుల దరఖాస్తులు అప్లోడ్ కాలేదని అందుకే నెట్లో హాల్ టికెట్లు లేవని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ప్రమేయం లేదు ఈ విషయమై మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, మోడల్ స్కూల్ నుంచి అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు ఇవ్వలేదన్నారు. వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని, ఇందులో తన ప్రమేయం లేదని చెప్పారు. ఉపాధ్యాయుడు జాకీర్‌హుస్సేన్ వివరణ.. కోదాడలోని కళాశాల ప్రతినిధి కుర్రె శ్రీనివాస్ ఎలాంటి ఫీజులేకుండా ఆన్లైన్లో పాలిసెట్‌కు దరఖాస్తు చేస్తానని చెప్పడంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించిన మాట వాస్తవమేనని తెలుగు ఉపాధ్యాయుడు జాకీర్ హుస్సేన్ చెప్పారు. అయితే, విద్యార్థులు నేరుగా కళాశాల ప్రతినిధికే దరఖాస్తులు ఇచ్చారని, వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా సాంకేతిక కారణాలతో అప్లోడ్ కాలేదని చెపుతున్నారని చెప్పారు. విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు... విద్యార్థుల భవిష్యత్‌తోచెలగాటం ఆడొద్దు. టెన్త్ పూర్తయిన నా కుమార్తెను పాలిటెక్నిక్ చేయించాకున్నా. పరీక్ష తేదీ దగ్గర పడినా హాల్‌టికెట్లు రాలేదు. దరఖాస్తులు చేరలేదనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. - సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, అల్లీపురం -
మఠంపల్లి నరసింహక్షేత్రంలో గో ఘోష
మఠంపల్లి: నిత్యం మత్రోఛ్ఛారణలు మారుమోగే ప్రఖ్యాత మఠంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహక్షేత్రంలో బుధవారం గో ఘోష వినిపించింది. క్షేత్రంలోని గో శాలలో జీవిస్తున్న గోవుల్లో 10 ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాయి. పరిస్థితి విషమించడంతో రెండు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. వ్యర్థపదార్థాలు తినడంవల్లే ఆవులు చనిపోయాయని తెలిసింది. మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహక్షేత్రంలో గల గోశాలలో 50 ఆవులు పెంచుతున్నారు. ప్రతిరోజూ గడ్డి మేపేందుకు వాటిని క్షేత్రం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళతారు. రోజూలాగే బుధవారం కూడా గడ్డిమేయడానికి అడవిలోకి వెళ్లిన ఆవుల్లో 10 గుర్తుతెలియని వ్యర్థపదార్థాలు తిని అనారోగ్యానికి గురయ్యాయి. విషయం తెలిసిన గోశాల నిర్వాహకులు పశువైద్యాధికారులను పిలిపించారు. అంతలోనే రెండు ఆవులు చనిపోగా, అనారోగ్యానికి గురైన మిగతా గోవులకు చికిత్స అందిస్తున్నారు. -
రైతు ఆత్మహత్య
మఠంపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాళెం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుచేసి వేసిన పంట వర్షాభావంతో కళ్లముందే ఎండిపోవడంతో ఆవేదన చెందిన నాగూ నాయక్(35) అనే రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి రూ.2.80 లక్షల అప్పు ఉంది. అది తీర్చే దారేదని ఆవేదన చెందేవాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. మృతుని భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. -
ముగిసిన రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు
మఠంపల్లి : మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని శుభవార్త చర్చి ఆధ్వర్యంలో మఠంపల్లిలోని వీవీ హైస్కూల్ మైదానంలో శుభోదయ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు ముగిశాయి. కాగా బుధవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన సీనియర్ విభాగం పోటీలలో ఖమ్మం జిల్లా పాతలింగాలకు చెందిన ఆర్ఎన్.రెడ్డి, నంది బ్రీడింగ్‌బుల్ సెంటర్ గిత్తలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేల బహుమతిని కైవసం చేసుకున్నాయి. అలాగే కృష్ణా జిల్లా బడిగంకు చెందిన రామభద్ర నందిబ్రీడింగ్ సెంటర్ గిత్తలు రెండవ స్థానంలో నిలిచి రూ.40 వేలు, నల్లగొండ జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బోయపాటి రఫేల్‌రెడ్డి మెమోరియల్ గిత్తలు మూడవ స్థానంలో నిలిచి రూ.30వేల బహుమతిని గెలుపొందాయి. గుంటూరు జిల్లా నిమ్మగడ్డ వారి పాలెంకుచెందిన కన్నెగంటి శంషయ్యచౌదరి గిత్తలు నాలుగో స్థానంలో నిలిచి రూ.25వేలు, గుంటూరు జిల్లా సీతారామపురంకు చెందిన దాసా నారాయణరావు గిత్తలు ఐదవ బహుమతిగా రూ.20వేలు, నల్లగొండ జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంకు చెందిన కొప్పుల శ్రీనివాసరెడ్డి గిత్తలు ఆరవ స్థానంలో నిలిచి రూ.10 వేలు గెలుపొందాయి. అర్ధరాత్రి వరకు జరిగిన పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ చిన్నయ్య, బ్రదర్ రవి కుమార్‌రెడ్డి, శుభోదయ యూత్ అధ్యక్షుడు తిరుమలరెడ్డి బాలశౌరెడ్డి, సర్పంచ్ స్రవంతికిషోర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గోపు రాజారెడ్డి, క్రిబ్కో ఆర్జేబీ మెంబర్ గాదె ఎలియాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు
ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా బృందం మఠంపల్లి, న్యూస్‌లైన్, జ్యోతిప్రకాశ్ యువజన నాట్యకళామండలి ఆధ్వర్యంలో మఠంపల్లిలో ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన కస్తాల దుర్గారావు బృందం(సత్యహరి శ్చంద్ర కాటిసీను) ప్రథమ స్థానంలో నిలిచి 10,016 నగదు బహుమతిని సొంతం చేసుకుంది. అలాగే గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన అంజిరెడ్డి బృందం(గయోపాఖ్యానం నాటక సీను) ద్వితీయ స్థానంలో నిలిచి 8,016 నగదును గెలుపొందింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సింగరి కొండయ్య బృందం(శ్రీకృష్ణరాయబారంలోని పడక సీను) తృతీయ స్థానంలో నిలిచి 6,016 నగదు బహుమతిని గెలుచుకుంది. అలాగే గుం టూరు జిల్లా పెదపాలెంకు చెందిన నీలం వెంకటేశ్వర్లు(హరిశ్చంద్ర కాటిసీను), నల్లగొండ జిల్లా నక్కగూడెంకు చెందిన దొంగరి పుల్లయ్య (హరిశ్చంద్ర వారణాసి), ఖమ్మం జిల్లాకు చెందిన మేకా రామ్మోహన్రావు(రామాంజ నేయ యుద్ధంలోని ఆంజనేయుని పాత్ర), హైదరాబాద్‌కు చెందిన ఎం.అర్జున్‌రావు(మహిషాసుర మర్దిని) ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారు. ఏకపాత్రభినయంలో.. ఏకపాత్రాభినయంలో పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరుకు చెందిన చిత్రినాథ్రాజు(దృతరాష్ట్రుడు) ప్రథమ స్థానంలో నిలిచి 4,016, నల్లగొండ జిల్లా మట్టపల్లికి చెందిన వెంకటశివ(నక్షత్రకుడు) ద్వితీయ బహుమతిగా *3,016, మేళ్లచెరువుకు చెందిన కోడూరు వెంకటరమణ(వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలోని ఈశ్వరమ్మ) తృతీయ బహుమతిగా 2,016 అందుకున్నారు. అలాగే నల్లగొండ జిల్లా చిలుకూరుకు చెందిన పొందూరు సత్యనారాయణ(దుర్యోధనుడు), అల్లీపురంకు చెందిన కొత్త్త భద్రయ్యాచారి(హరిశ్చంద్ర కాటిసీను), గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన ఉల్లంగుల నర్సింహా రావు(అర్జునుడు), కృష్ణా జిల్లా పెడనకు చెందిన ముత్యాల ఏసుబాబు(అంధుడు) ప్రోత్సాహ బహుమతిగా 600 చొప్పున గెలుపొందారు. అదేవిధంగా ప్రతిభ కనబర్చిన మరో 15మంది కళాకారులకు ప్రత్యేక జ్యూరీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శు లు బోనగిరి ప్రకాశ్‌బాబు, గుంటి పిచ్చయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఎరగాని నాగన్నగౌడ్, గోలి వెంకటేశ్వర్లు, బత్తిని ధర్మయ్యగౌడ్, జగ్గయ్య, రామారావు, ఆనంద్, జోసు, వ్యాఖ్యాత భవాని, న్యాయనిర్ణేతలు బాలకోటయ్య, పట్టాబిదాసు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.