Matrimony.com
-
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
మాట్రిమోనీ- 4 రోజుల్లో 49% జూమ్
కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) వాటాలను పెంచుకున్నట్లు వెల్లడికావడంతో ఇంటర్నెట్ కంపెనీ మాట్రిమోనీ.కామ్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో తాజాగా ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో ఎన్ఎస్ఈలో రూ. 93 ఎగసి రూ. 559 వద్ద ఫ్రీజయ్యింది. మంగళవారం సైతం ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకిన విషయం విదితమే. వెరసి గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 49 శాతం దూసుకెళ్లింది! తద్వారా 2019 జులై 23న సాధించిన చరిత్రాత్మక గరిష్టం రూ. 639కు చేరువైంది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి మిడ్‌సెషన్‌కల్లా 3.52 లక్షల షేర్లు చేతులు మారాయి. 14.74 శాతానికి కంపెనీలో జూన్ చివరికల్లా ఎఫ్‌పీఐల వాటా 14.74 శాతానికి ఎగసింది. మార్చి చివరికల్లా ఎఫ్‌పీఐల వాటా 12.51 శాతంగా నమోదైంది. ఎక్స్ఛేంజీలకు కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఏప్రిల్-జూన్ కాలంలో ఎఫ్‌పీఐల వాటా 2.23 శాతం పెరిగింది. ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేందుకు వీలు కల్పించే ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్‌లో మరింత వృద్ధిని అందుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇటీవల కోవిడ్-19 కారణంగా వివాహ వేడుకలు తగ్గడం కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని అంచనా వేశారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లు కంపెనీ యాజమాన్యం ఇటీవల అభిప్రాయపడింది. -
ఐపీఓకు వస్తున్న మ్యాట్రిమోని
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ)కు రానున్నది. సెప్టెంబర్ 11న ఇది స్ట్రీట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. జూలైలోనే ఈ ఐపీఓకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను కూడా ఈ సంస్థ సెబీకి సమర్పించింది. 3,767,254 ఈక్విటీ షేర్లను ఈ సంస్థ జారీచేయనుంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ప్రకటనలకు, వ్యాపార ప్రమోషన్ కార్యకలాపాలకు, చెన్నై పరిసర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి ఆఫీసు కట్టడానికి, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను తిరిగి చెల్లించడానికి, జనరల్ కార్పొరేట్ అవసరాలకు వాడనుంది. ఈ ఐపీఓ ద్వారా మ్యాట్రిమోని రూ.500 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదని సమాచారం. సెప్టెంబర్ 11 మొదలయ్యే ఈ ఐపీఓ ఆఫర్, సెప్టెంబర్13తో ముగుస్తుంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్‌కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని, రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.