హ్యాండిల్ పట్టుకుంటే.. చేతులు క్లీన్ అవుతాయ్..!
వినూత్నమైన తలుపు, దాని హ్యాండిల్ చూస్తున్నారు కదా. ఈ తలుపు హ్యాండిల్‌ను పట్టుకుంటే మన చేతులు వెంటనే క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే వీటిని పట్టుకోగానే బ్యాక్టీరియాను చంపేసే జెల్ చేతులకు అంటుకుంటుంది. దానిని రెండు చేతులతో రుద్దుకుంటే సరి. చేతులు శుభ్రమైనట్లే. పుల్క్లీన్ అనే ఈ హ్యాండిల్‌ను మాట్ రాబర్ట్స్(31) అనే ఈ బ్రిటన్ యువకుడే తయారు చేశాడు. బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో ఆసుపత్రుల వార్డుల్లో ఇన్ఫెక్షన్లను నివారించేందుకుగాను వార్డులోకి ప్రవేశించేముందు సందర్శకులు, ఆసుపత్రి సిబ్బంది తమ చేతులను బ్యాక్టీరియా రహితం చేసుకునేందుకు వీలుగా గోడలపై జెల్ బాక్సులను అమర్చుతారు.
అయితే జెల్ బాక్సులు ఉన్నా.. వాటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ పోస్టర్లు ఉంచినా.. చాలా మంది తమ చేతులను క్లీన్ చేసుకోవడం లేదట. అందుకే ఇలా డోర్ హ్యాండిల్ పట్టుకోగానే జెల్ బయటికి వచ్చి వారి చేతులకు అంటితే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన రాబర్ట్స్ ఈ కొత్త హ్యాండిల్స్‌ను తయారు చేశాడు. ఆసుపత్రి సిబ్బంది కాగితాలు తీసుకెళుతున్నప్పుడు జెల్ రుద్దుకోవడం కుదరదు కాబట్టి.. వారి కోసం జెల్ బయటికి రాని మామూలు హ్యాండిల్ కూడా కింద ఉంటుంది.