విభజనను సుప్రీంకోర్టులో సవాల్‌చేస్తాం
సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్
విజయవాడ లీగల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనలో రాజకీయాలు జరిగితే సుప్రీం కోర్టులో సవాల్‌చేస్తామని న్యాయవాదుల సీమాంధ్ర జేఏసీకన్వీనర్, బీబీఏ అధ్యక్షుడు మట్టా జయకర్ స్పష్టంచేశారు. స్థానిక ఎ.ఎస్.రామారావు హాలులో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే తాము ఉద్యమం చేపట్టామన్నారు.
సీమాంధ్ర జేఏసీ కోకన్వీనర్, ఏపీ బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని తీర్మానించినా విస్మరించి, ఆంధ్రప్రదేశ్ విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. బీబీఏ మాజీ అధ్యక్షుడు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, ఏపీ బార్ కౌన్సిల్ బాధ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు.
సమైక్యరాష్ట్రం కోసం న్యాయవాదుల విధుల బహిష్కరణను ఫిబ్రవరం మూడో తేదీ వరకూ పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణ మోహన్, వి.బ్రహ్మారెడ్డి, వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు జవహర్‌లలీ, కె.రామకృష్ణ, వి.రమణారావు, శ్రీనివాసరావు, నరహరిశెట్టి శ్రీహరి, కె.ఎస్,సుధాకర రాజు పాల్గొన్నారు. సమైక్యాంద్ర కోసం న్యాయవాదులే ఎందుకు ఉద్యమం చేయాలంటూ కొంత మంది న్యాయవాదులు కరపత్రాలు పంచారు.