అతనిపై వేటు తప్పదు: స్టీవ్ స్మిత్
చిట్టగాంగ్: గత కొంతకాలంగా తీవ్రంగా నిరాశపరుస్తున్న తమ వికెట్ కీపర్ మాథ్య వేడ్ ను బంగ్లాదేశ్ జరిగే రెండో టెస్టుకు పక్కన పెడుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. అతని ఫామ్ ను బట్టి చూస్తూ వేటు తప్పడం లేదన్నాడు. 'వేడ్ బ్యాట్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. అతను తరచు విఫలం కావడంతోనే బంగ్లాదేశ్ మ్యాచ్ కు అతన్ని బెంచ్ కే పరిమితం చేస్తున్నాం. వేడ్ బ్యాటింగ్ లో విఫలమవుతున్న సంగతి అతనికి కూడా తెలుసు. జట్టులో సమతుల్యతో కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. వికెట్ కీపర్ బాధ్యతల్ని హ్యాండ్ స్కాంబ్ కు అప్పచెప్పే అవకాశం ఉంది. వేడ్ ను కూర్చొబెట్టడం కాస్త కఠిన నిర్ణయమే. అయినా తప్పదు'అని స్మిత్ తెలిపాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. సిరీస్ ను సమం చేయాలంటే రెండో టెస్టులో ఆసీస్ గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. గాయపడ్డ హజల్ వుడ్ స్థానంలో స్పిన్నర్ ఓకెఫీకీ చోటు దక్కే అవకాశం ఉంది.