‘ముస్లిం లా’ను మార్చడానికి కుట్రలు
జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు మౌలానా జలాలొద్దీన్ ఉమ్రీ
సాక్షి, హైదరాబాద్: ముస్లిం పర్సనల్ లా రాజ్యాంగం ముస్లింలకు ఇచ్చిన హక్కని, దాన్ని మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు మౌలానా జలాలొద్దీన్ ఉమ్రీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమ ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరి మత సంప్రదాయాలను ఆచరించే హక్కు రాజ్యాంగం ఆ ప్రజలకు కల్పించిందన్నారు.
ఇస్లాం చట్టాల్లో మార్పులు, సవరణలు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలను పాటించడం ప్రతీ ముస్లిం బాధ్యత అని చెప్పారు. ముస్లిం పర్సనల్ లాలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, ఇతర ముస్లిం ధార్మిక సంస్థల నేతలు పాల్గొన్నారు.