మ్యాక్స్‌క్యూర్ వైద్యుల ఘనత
* విజయవంతంగా మోకాలి చిప్పల మార్పిడి
* సర్జరీ పూర్తికాగానే నడక ప్రారంభించిన పేషెంట్
హైదరాబాద్: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కంప్యూటర్ అసిస్టెడ్ నావి గేషన్ సిస్టంతో శస్త్ర చికిత్స చేసి 3 గంటల వ్యవధిలోనే పేషెంట్ నడిచేలా చేశారు.
వనస్థలిపురానికి చెందిన మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సభ్యుడు పి.సుధాకర్‌రావు (74) ఏడాదిన్నర నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. మందులు వాడితే నొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది. దీంతో ఇటీవల మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలోని ప్రముఖ హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణకిరణ్‌ను ఆయన సంప్రదించారు.
సుధాకర్‌రావుకు సిటీస్కాన్ తీయించగా రెండు మోకాలి చిప్పల మధ్యలోని కార్టిలేజ్ (గుజ్జు) పూర్తిగా అరిగిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు ఆయనకు సూచించారు. గత శుక్రవారం ఉదయం కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సుధాకర్‌రావుకు శస్త్రచికిత్స ప్రారంభించారు. చిన్న గాటుతో మోకాలి చిప్పల చుట్టూ ఉన్న కండరాన్ని కత్తిరించకుండా అరిగిపోయిన చిప్పలను తొలగిం చారు. వాటి స్థానంలో కృత్రిమ మోకాలి చిప్పలను విజయవంతంగా అమర్చారు.
శస్త్ర చికిత్స చేసిన 3 గంటల వ్యవధిలోనే 74 ఏళ్ల సుధాకర్‌రావు ఎవరి సహాయం లేకుండా బెడ్ మీద నుంచి లేచి నడవడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకిరణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సర్జరీ చేయడం వల్ల రక్తస్రావం లేకుండా, తక్కువ నొప్పితో చికిత్స చేయవచ్చని తెలిపారు.