మూల విరాట్
► ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన కోహ్లి
► టి20 ప్రపంచకప్ సెమీస్‌లో ధోని సేన
► కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో విజయం
ఎవరన్నారు... సచిన్ తర్వాత మరో క్రికెట్ దేవుడు రాడని..! విరాట్ కోహ్లి రూపంలో ఎప్పుడో వచ్చాడు. ఆ ‘దేవుడి’ తాండవం ప్రతిసారీ చూస్తున్నా... ఈసారి విశ్వరూపమే చూపించాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్... ఓ ఎండ్‌లో వెనుదిరుగుతున్న సహచరులు... ఎదురుగా కొండలా లక్ష్యం... పెరిగిపోతున్న రన్‌రేట్... మరింత పెరుగుతున్న ఒత్తిడి... అయితేనేం... మూల విరాట్ ‘మాయ’ చేశాడు. పరుగుకే అలుపొచ్చేలా పరుగు... బౌండరీ వెనక బౌండరీ... ఏ మాత్రం తడబాటు లేకుండా... యావత్ భారతదేశాన్ని ఆనంద డోళికల్లో ముంచెత్తాడు. జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడి టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను సెమీస్‌కు చేర్చాడు.
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి:- 11 బంతుల్లో 32 పరుగులు... భారత్‌ను గెలిపించే క్రమంలో విరాట్ కోహ్లి చివరి 11 బంతుల స్కోరు ఇది. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన పరాజయాన్ని కూడా వెనక్కి తెచ్చి విజయంగా మార్చగల సత్తా తనకు ఉందని ఈ సూపర్ స్టార్ మరో సారి నిరూపించాడు. లెక్కలేనన్ని అతని అమూల్య ఇన్నింగ్స్‌లలో మరొకటి చేరింది. కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ 2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
ఆరోన్ ఫించ్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాక్స్ వెల్ (28 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (51 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (10 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు) ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే 67 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరింది. ఈ నెల 31న ముంబైలో జరిగే సెమీస్‌లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది.
ఆరంభం ఘనం
ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఖాజా (16 బంతుల్లో 26; 6 ఫోర్లు), ఫించ్ మెరుపు ఆరంభం అందించారు. బుమ్రా తొలి ఓవర్లో ఖాజా నాలుగు ఫోర్లు బాదగా, అశ్విన్ తన తొలి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు సహా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆసీస్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 25 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. అయితే ఖాజాను అవుట్ చేసి నెహ్రా, ఆసీస్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మరి కొద్ది సేపటికే వార్నర్ (6) కూడా వెనుదిరిగాడు. టోర్నీలో తొలిసారి బౌలింగ్‌కు దిగిన యువరాజ్ మొదటి బంతికే స్మిత్ (2)ను పెవిలియన్‌కు పంపించడంతో భారత శిబిరంలో ఆనందం పెరిగింది. ఈ దశలో బౌలర్లు మరింత కట్టడి చేయడంతో పరుగులు చేయడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా తడబడ్డారు. శుభారంభం తర్వాత ఆ జట్టు ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది.
హిట్టర్లుగా పేరు పొందిన బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ తీయడానికే శ్రమించారు. ఈ క్రమంలో ధాటిగా ఆడే ప్రయత్నం చేసి ఫించ్ కూడా అవుటయ్యాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్, వాట్సన్ (16 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కొన్ని పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లు ఏకంగా 44 డాట్ బంతులు విసరడం చూస్తే ఆసీస్ ఎంతగా ఇబ్బంది పడిందో అర్థమవుతుంది. ఇందులో నెహ్రా ఒక్కడే 13 బంతులు వేశాడు.
విరాట్ విశ్వరూపం
వరల్డ్ కప్‌లో మరోసారి భారత ఓపెనర్లు నిరాశపరిచే ఆరంభాన్ని ఇచ్చారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ధావన్ (12 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), రోహిత్ (17 బంతుల్లో 12; 1 ఫోర్) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. కూల్టర్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి ధావన్ బంతిని గాల్లో లేపగా, వాట్సన్ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత రైనా (10) కూడా షార్ట్ పిచ్ బంతిని ఇబ్బందిగా ఆడి పెవిలియన్ చేరాడు. ఈ దశలో కోహ్లి, యువరాజ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఒక వైపు కోహ్లి అలవోకగా సింగిల్స్ తీసుకోగా, కాలి మడమ గాయంతో బాధపడుతూ రెండు సార్లు చికిత్స తీసుకున్న యువీ క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేశాడు. అయితే కవర్స్‌లో వాట్సన్ అద్భుత క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు.
6 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన కోహ్లి, ధోని చెలరేగిపోయారు. తమదైన వేగంతో ఆసీస్ ఫీల్డర్లను పరుగులు పెట్టించి వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కోహ్లి ఏ బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించిన తీరు, వీరిద్దరు సింగిల్స్‌ను రెండు పరుగులుగా మార్చిన తీరు అమోఘం. 17 ఓవర్లు ముగిసిన తర్వాత కూడా ఆసీస్ ఆశతోనే ఉంది. కానీ ఫాల్క్‌నర్ వేసిన 18వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. మరో సారి తనదైన శైలిలో భారీ షాట్‌తో ధోని మ్యాచ్ ముగించడం విశేషం.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖాజా (సి) ధోని (బి) నెహ్రా 26; ఫించ్ (సి) ధావన్ (బి) పాండ్యా 43; వార్నర్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 6; స్మిత్ (సి) ధోని (బి) యువరాజ్ 2; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 31; వాట్సన్ (నాటౌట్) 18; ఫాల్క్‌నర్ (సి) కోహ్లి (బి) పాండ్యా 10; నెవిల్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1-54; 2-72; 3-74; 4-100; 5-130; 6-145.
బౌలింగ్: నెహ్రా 4-0-20-1; బుమ్రా 4-0-32-1; అశ్విన్ 2-0-31-1; జడేజా 3-0-20-0; యువరాజ్ 3-0-19-1; పాండ్యా 4-0-36-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) వాట్సన్ 12; ధావన్ (సి) ఖాజా (బి) కూల్టర్ నీల్ 13; కోహ్లి (నాటౌట్) 82; రైనా (సి) నెవిల్ (బి) వాట్సన్ 10; యువరాజ్ (సి) వాట్సన్ (బి) ఫాల్క్‌నర్ 21; ధోని (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1-23; 2-37; 3-49; 4-94.
బౌలింగ్: హాజల్‌వుడ్ 4-0-38-0; కూల్టర్ నీల్ 4-0-33-1; వాట్సన్ 4-0-23-2; ఫాల్క్‌నర్ 3.1-0-35-1; మ్యాక్స్‌వెల్ 2-0-18-0; జంపా 2-0-11-0.