Maxcure Hospitals
-
మ్యాక్స్‌క్యూర్.. ఇక మెడికవర్ హాస్పిటల్స్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ పేరు మారింది. ఇక నుంచి మెడికవర్ హాస్పిటల్స్‌గా పిలుస్తారు. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రమోట్ చేస్తున్న సహృదయ హెల్త్‌కేర్‌లో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు ఇప్పటి వరకు 46.5 శాతం వాటా ఉంది. నవంబరు నాటికి ఇది 51 శాతానికి చేరనుంది. హెల్త్‌కేర్, డయాగ్నోస్టిక్స్ సేవలతో అంతర్జాతీయంగా విస్తరించిన మెడికవర్.. తాజా డీల్‌తో భారత ఆరోగ్య సేవల రంగంలో ప్రవేశించినట్టయింది. సహృదయలో మెడికవర్ ఇప్పటికే రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టింది. మిగిలిన 4.5 శాతం వాటా కోసం మరో రూ.50 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తోంది. సహృదయ హెల్త్‌కేర్ బోర్డులోకి మెడికవర్ చేరినప్పటికీ, రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి జోక్యం ఉండబోదని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న ఈ యూరప్ సంస్థ రానున్న రోజుల్లో సహృదయ హెల్త్‌కేర్‌లో వ్యూహాత్మక భాగస్వామిగా మరింత వాటా పెంచుకోనుంది. కొత్తగా ఆసుపత్రులు.. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రముఖ వైద్యుడు అనిల్ కృష్ణ స్థాపించారు. హైదరాబాద్‌లో మూడు, వైజాగ్‌లో రెండు, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, నెల్లూరు, కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక్కో ఆసుపత్రి ఉంది. వీటన్నిటి పడకల సామర్థ్యం 2,000 దాకా ఉంది. కొత్తగా భాగ్యనగరిలో రెండు, ముంబైలో ఒక హాస్పిటల్ ఈ ఏడాది నవంబరుకల్లా సిద్ధమవుతున్నాయి. వీటి రాకతో 700 పడకలు జతకూడనున్నాయని మెడికవర్ ఇండియా ఎండీ అనిల్ కృష్ణ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ‘సంస్థలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పటికే 6,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి ఆసుపత్రి ద్వారా 600 నుంచి 1.000 మందికి ఉపాధి లభించనుంది’ అని వివరించారు. డీల్ తదనంతరం అనిల్ కృష్ణ వాటా 33 శాతం, వైద్యులైన ఇతర ఇన్వెస్టర్ల వాటా 16%గా ఉంటుంది. మెడికవర్ ఇండియా ఎండీ అనిల్ కృష్ణ -
సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటుడు రాళ్లపల్లి(63) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతూ హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి వెంకట నరసింహా రావు. ఇంటి పేరుతోనే రాళ్లపల్లిగా ప్రసిద్ధి గాంచారు. రాళ్లపల్లి నరసింహారావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాళ్లపల్లి. స్త్రీ(1973) ఆయన మొదటి చిత్రం. చివరి చిత్రం భలేభలే మగాడివోయ్. సుమారు 850 చిత్రాల్లో రాళ్లపల్లి వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు చిత్రాలు రాళ్లపల్లికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలకపాత్రల్లో రాళ్లపల్లికి నటించే అవకాశం వచ్చింది. రాళ్లపల్లి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాటక, బుల్లితెర, వెండితెరపై తన అసమాన నటనతో, రాళ్లపల్లి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. రచయితగా, దర్శకుడిగా తెలుగు సినీరంగానికి ఎనలేని సేవలందించారని అన్నారు. రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం చెన్నైలోని వాణి మహల్ లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను. -
మ్యాక్స్‌క్యూర్‌లో వాటా విక్రయం
♦ మెడికవర్ చేతికి 22 శాతం వాటా ♦ విలువ రూ.100 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో యూరప్ సంస్థ మెడికవర్ 22 శాతం వాటా చేజిక్కించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించింది. రెండేళ్లలో మరో రూ.220 కోట్ల దాకా వ్యయం చేయనుంది. తద్వారా మెడికవర్ వాటా 51 శాతానికి చేరుతుందని మ్యాక్స్‌క్యూర్ ఎండీ అనిల్ కృష్ణ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు నగరాల్లో 9 ఆసుపత్రులను నిర్వహిస్తున్నామని, 1,500 పడకల సామర్థ్యం ఉందని ఆయన తెలియజేశారు. 2016–17లో రూ.350 కోట్ల టర్నోవర్ సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు ఆశిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 250 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదించామని, వరంగల్, కాకినాడలోనూ అడుగు పెట్టనున్నామని వివరించారు. బెంగళూరు, పుణే, చెన్నై, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తామని మ్యాక్స్‌క్యూర్ సీఈవో హరికృష్ణ చెప్పారు. రెండేళ్లలో ఆసుపత్రుల సంఖ్య 20కి చేరనుందని, ఇందుకు రూ.500 కోట్ల దాకా వెచ్చిస్తామని తెలియజేశారు. భారత్‌లో సెలెక్స్ గ్రూప్ పాగా.. మెడికవర్‌ను ప్రమోట్ చేస్తున్న సెలెక్స్ గ్రూప్ భారత్‌లో దీర్ఘకాలిక వ్యూహంతో అడుగులేస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గతేడాది ఏడు ఫెర్టిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మరో 10 కేంద్రాలను నెలకొల్పుతామని, 2019 కల్లా వీటి సంఖ్య 50కి చేరుతుందని మెడికవర్ చైర్మన్ ఫ్రెడ్రిక్ స్టెన్మో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘మార్కెట్ కంటే వేగంగా మ్యాక్స్‌క్యూర్‌ను విస్తరిస్తాం. ప్యారడైజ్ రెస్టారెంట్స్‌లో మాకు 50 శాతం వాటా ఉంది. ఈ రెస్టారెంట్ల సంఖ్య పెరిగేలా చూస్తాం. రానున్న రోజుల్లో భారత్‌లో డయాగ్నొస్టిక్ సేవల్లోకి కూడా ప్రవేశిస్తాం. ఏడేళ్లలో దేశంలో రూ.650 కోట్ల దాకా ఖర్చు చేశాం. మ్యాక్స్‌క్యూర్ పెట్టుబడి చాలా చిన్నది. ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తాం. మా కుటుంబంలో రెండో తరం వ్యాపార బాధ్యతలు తీసుకుంది. భారత్‌లో అపార వ్యాపార అవకాశాలున్నాయి. ఇక్కడ నిలదొక్కుకుంటాం’’ అని వెల్లడించారు. సెలెక్స్ గ్రూప్ నిర్వహణలో ఒరిఫ్లేమ్, ఒరెసా అసెట్ మేనేజ్మెంట్ వంటి కంపెనీలున్నాయి.