మ్యాక్స్ వెల్ వీర బాదుడు, పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
అబుదాబి: ఐపీఎల్-7లో అసలు మజా మొదలయింది. భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు పంజాబ్ ఎలెవన్ కింగ్స్ షాకిచ్చింది. ఆరు వికెట్ల తేడాతో ధోని సేనను ఓడించింది. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో చెన్నైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లను మ్యాక్స్ వెల్ ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో వీర బాదుడు బాదాడు.
మ్యాక్స్ వెల్ విజృంభణతో 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. ఏడు బంతులు మిగులుండగానే పంజాబ్ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్ వెల్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించాడు. 43 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మిల్లర్(54) అర్థ సెంచరీతో రాణించాడు. పూజారా 13, సెహ్వాగ్ 19, బెయిలీ 13 పరుగులు చేశారు. అశ్విన్ 2 వికెట్లు తీశాడు, నెహ్రా, స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. స్మిత్(66), మెక్ కల్లమ్(67) అర్థ సెంచరీలు చేశారు. రైనా 24, ధోని 26 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో బాలజీ 2 వికెట్లు పడగొట్టాడు. ఏఆర్ పటేల్, ఆవానా చెరో వికెట్ తీశారు. మ్యాక్స్ వెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద' మ్యాచ్ దక్కింది.