గ్రేటర్లో గ్రీన్ విప్లవాన్ని చాటాలి - మేయర్ బొంతు
గేటర్ ప్రజలంతా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని, హరిత హారం కార్యక్రమంలో భాగంగా నగరమంతా ఏకమై ఒక శక్తిగా గ్రీన్ విప్లవాన్ని చాటాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఊహించిన దానికంటే అధికసంఖ్యలో పలు సంస్థలు మెగా హరితహారంలో భాగస్వాములవుతున్నాయని, ప్రజలు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారన్నారు.
నగరంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం మెగా హరిత హారంలో భాగంగా ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురస్కరించుకొఆదివారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మూడు సంవత్సరాల్లో 10 కోట్ల మొక్కలు నాటాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకనుగుణంగా నిర్వహిస్తున్న మెగా హరితహారంలో పాఠశాల విద్యార్థుల నుంచి మిలటరీ బ్రిగేడియర్ల దాకా ఎందరెందరో భాగస్వాములవుతున్నారన్నారు. మెగా హరితహారంలో ఒకేరోజు 25 లక్షల మొక్కల లక్ష్యాన్ని మంత్రి కేటీఆర్ నిర్దేశించారని చెబుతూ, ప్రస్తుత పరిస్థితి మేరకు 35 లక్షల మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రై వేట్ సంస్థలతోపాటు ఖాలీ ప్రదేశాలు,ఇళ్లల్లో అన్నిచోట్లా మొక్కలు నాటేందుకు భారీ స్పందన కనబడుతోందని చెప్పారు.
గ్రీన్ హైదరాబాద్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవడం ద్వారా అందరికీ సమాచారం వెళ్లిందని, ఎందరో మొక్కల్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారన్నారు. ఆ సదుపాయాన్ని వినియోగించుకోని వారు, నర్సరీలు ఎక్కడున్నాయో తెలియని వారి కోసం వందప్రాంతాల్లో స్టాళ్ల ద్వారా మొక్కల్ని పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రేటర్ పరిధిలోకొచ్చే మెదక్జిల్లాలో 6 లక్షలకు పైగా,రంగారెడ్డిజిల్లాలో 4 లక్షలకు పైగా మొక్కలు నాటనున్నట్లు సంబంధిత కలెక్టర్లు తెలిపారన్నారు. మిలటరీ విభాగం ఆధ్వర్యంలో 1.50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 80 శాతం పైగా మొక్కలు నిర్ణీత ప్రదేశాలకు చేరాయనాక్నరు.