రేపు ‘హరిత కడప’కు శ్రీకారం
కడప కార్పొరేషన్: కడపను హరిత నగరం (గ్రీన్‌సిటీ)గా మార్చేందుకు నగరపాలక సంస్థ ఈనెల 24నుంచి 30వ తేదీవరకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మద్దిమడుగు సోషల్ ఫారెస్ట్రీ వారు వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు నగర మేయర్ కె.సురేష్‌బాబు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలతో డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ కూడా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.‘ఈచ్ ఒన్ ప్లాంట్ ఒన్’(ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి) అనే నినాదంతో నగరంలోని 50 డివిజన్లలో ఒక్కో డివిజన్లో 2000ల మొక్కలు నాటనున్నారు.
దీనికి సంబంధించి అయా డివిజన్ల కార్పొరేటర్లకు, అన్ని విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో మొక్కలను విరివిగా నాటనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి జిల్లా కలెక్టర్ కేవీ రమణ, మేయర్ సురేష్‌బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా పాల్గొననున్నారు. నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు కార్పొరేషన్‌ను సంప్రదిస్తే వారికి ఉచితంగా మొక్కలు అందిస్తామని తెలిపారు.