మాజిద్ రాజీనామాను ఆమోదించని కౌన్సిల్
హైదరాబాద్ : హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. కౌన్సిల్ సాధారణ సమావేశంలో మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామాను కౌన్సిల్ ఆమోదించలేదు. కాంగ్రెస్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపలేదు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా రాజీనామా చేస్తారంటూ మరోవైపు టీడీపీ, బీజేపీ ప్రశ్నించాయి. సమావేశం నుంచి బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. కాగా కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అయితే, అంతకుముందు కాంగ్రెస్ మేయర్ బండ కార్తీక రెడ్డి రెండు నెలలు అదనంగా ఉన్నందున తాను కూడా రెండు నెలలు అదనంగా ఉన్నానని మాజిద్ చెప్పారు. కాంగ్రెస్ - ఎంఐఎం మధ్య ఎన్నికల పొత్తు కూడా తేలకపోవడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మేయర్ పదవికి మాజిద్ రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు.