పొత్తు లేదు
- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ఎవరితోనూ మైత్రి ప్రస్తావనే లేదు
- స్పష్టం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ సీటు కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లతో శనివారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. మేయర్ ఎంపిక పూర్తయ్యే వరకు నగరాన్ని వీడి ఎక్కడికీ వెళ్లవద్దని కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లకు ఈ సమావేశంలో సిద్దరామయ్య సూచించినట్లు సమాచారం. అంతేకాక ఎన్నికల సమయంలో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయా వార్డుల్లో కార్పొరేటర్లు శ్రమిం చాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డాలని మార్గనిర్దేశనం చేశారు.
ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సమావేశానికి ముందు సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ....బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తుందని తెలి పారు. మేయర్ సీటు కోసం ఎవరితోనూ పొత్తు కు దుర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నా రు. అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... బీబీఎంపీ ఎన్నికల్లో మైత్రికి సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని అన్నారు. అయినా పార్టీ అనుమతి లేకుండానే మైత్రి చర్చలు జరిపిన నాయకుల నుంచి వివరణ కోరనున్నట్లు పరమేశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోనుందనే వ్యాఖ్య లు సత్యదూరమని స్పష్టం చేశారు.