‘మహా’ పాలిటిక్స్.. బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులుగా మారటం, మిత్రులు ప్రత్యర్థులుగా మారటం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. మరోమారు.. అలాంటి సంఘటనే ఎదురైంది. విపక్ష పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్.. బీజేపీతో చేతులు కలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఈ మేరకు సోమవారం బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌తో సమావేశమయ్యారు శరద్ పవార్. ఆశిష్ షెలార్- శరద్ పవార్ గ్రూప్ కలిసి అభ్యర్థిని బరిలో దింపాయి.
అంతకు ముందు.. ఎంసీఏ అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు శరద్ పవార్ గ్రూప్ మద్దతు తెలిపింది. కానీ, ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో కలిసి ఎంసీఏ ఎన్నికల బరిలో నిలుస్తోంది ఎన్సీపీ. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా ఈ కూటమి ఎమ్మెల్యే జితెంద్ర అహ్వాద్ బరిలో నిలుస్తున్నారు. పవార్-షెలార్ గ్రూప్ నుంచి ఉద్ధవ్ థాక్రే పీఏ మిలింద్ నర్వేకర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు.. షిండే గ్రూప్ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహాంగ్ సర్నాయ్ ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 ఛైర్మన్ పదవి బరిలో నిలిచారు. ఈ మేరకు ఆశిష్ ,షెలార్‌తో శరద్ పవార్ కూటమి ఏర్పాటు చేసినట్లు ఓ లేఖ విడుదల చేశారు. లేఖపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మిలింద్ నర్వేకర్ ట్వీట్ చేశారు. అందులో ఆశిష్ షెలార్ ఫోటో కనిపిస్తోంది.
అక్టోబర్ 20న ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పవార్-షెలార్ సంయుక్త గ్రూప్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితుడు అమోల్ కాలే ఉపాధ్యక్షుడి బరిలో నిలవనున్నారు. మరోవైపు.. 2019-22 వరకు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన పవార్ గ్రూప్ అభ్యర్థి అజింక్య నాయక్ సెక్రెటరీగా కొనసాగే అవకాశం ఉంది. దీపక్ పాటిల్ సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు