MCC world cricket Committee
-
టీమిండియా మాజీ బౌలర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్‌లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్‌కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
సంగక్కర పదవీకాలం పొడిగింపు
లండన్: ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు. -
‘మన్కడింగ్’లో మార్పు లేదు
స్పష్టం చేసిన ఎంసీసీ లండన్: అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘మన్కడింగ్’ నిబంధనను మార్చాల్సిన అవసరం లేదని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ తేల్చి చెప్పింది. మన్కడింగ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని అభిప్రాయ పడింది. బౌలర్ బంతి విసరక ముందే (డెలివరీ స్ట్రైడ్ పూర్తి కాకుండా) నాన్‌స్ట్రైకర్ ఆటగాడు క్రీజ్‌ను విడిచి ముందుకు వెళితే అతడిని బౌలర్ అవుట్ చేయవచ్చని మన్కడింగ్ నిబంధన చెబుతోంది. అయితే తరచూ ఇది వివాదాస్పదం అవుతోంది. ఇటీవల ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్‌ను లంక బౌలర్ సేనానాయకే ఇలా అవుట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ దుమారం రేపింది. అయితే వరల్డ్ క్రికెట్ కమిటీ సభ్యుడైన ఆండ్రూ స్ట్రాస్ ఇందులో తప్పేమీ లేదన్నారు. ‘ఇది క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయం కాదు. ఇది నిబంధనలను సరిగ్గా పాటించడానికి సంబంధించినది. అలా అవుట్ కాకూడదంటే మీరు సరిగ్గా క్రీజ్‌లో ఉండండి చాలు. దీని గురించి బౌలర్ గానీ, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ గానీ హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. మన్కడింగ్ లేకపోతే నాన్‌స్ట్రైకర్ అదనపు ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తాడు’ అని స్ట్రాస్ స్పష్టం చేశారు.