'టెక్నాలజీతో అమాయకుల ఊసురు తీస్తున్నారు'
సరిహద్దు తీవ్రవాదం దేశానికి ముందున్న అతి పెద్ద సవాల్ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో నేషనల్ డిజిటల్ క్రైం రిసోర్స్ సెంటర్‌తోపాటు ఎంసీటీసీ భవనాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సమాజంలో సమస్యలకు మావోయిజం పరిష్కారం కాదని అన్నారు.
దేశంలో మార్పు రావాలంటే సమాజంతోపాటు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులకు సిబ్బందికి మరింత శిక్షణ అవసరమని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య నాయుడు తెలిపారు. తీవ్రవాదులకు దీటుగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని పోలీసు శాఖకు హితవు పలికారు. తీవ్రవాదులు టెక్నాలజీతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.