జపాన్ నుంచి పెట్టుబడుల వెల్లువ: చందా కొచర్
జపనీస్ పెట్టుబడులకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కోట్లాది డాలర్ల నిధులు భారత్‌లోకి వెల్లువెత్తనున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ పేర్కొన్నారు. మోడీతో పాటు జపాన్ పర్యటనలో పాల్గొంటున్న కొచర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రైల్వేలు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్‌తో పాటు మౌలిక సదుపాయాల రంగంలో భారీగా జపాన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఈ నిధుల కల్పనలో తమ బ్యాంక్ కూడా కీలక పాత్ర పోషించనుందని ఆమె చెప్పారు. ఈ దిశగా జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌తో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీలు ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నట్లు కొచర్ వెల్లడించారు.