బ్రౌన్ రైస్‌లోకి ‘బెల్’ బ్రాండ్
రూ.30 కోట్లతో కొమరిపాలెం మిల్లు విస్తరణ
- థాయ్‌లాండ్‌లో రూ.60 కోట్లతో మరో మిల్లు
- ‘శ్రీ మురళీ మోహన’ సంస్థ ఎండీ చింతా రాఘవరెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బియ్యం వ్యాపారంలో ఉన్న శ్రీ మురళి మోహన బాయిల్డ్, రా రైస్ మిల్.. బ్రౌన్ రైస్ విభాగంలోకి ప్రవేశించింది. 2015-16లో 2,000 టన్నుల బ్రౌన్ రైస్‌ను విక్రయించాలని లక్ష్యించింది. ప్రజల్లో బ్రౌన్ రైస్పట్ల అవగాహన పెరుగుతోందని, మున్ముందు భారీ వ్యాపార అవకాశాలు ఉంటాయని కంపెనీ భావిస్తోంది.
బెల్ బ్రాండ్ కింద అన్ని మందుల షాపులు, కిరాణా దుకాణాల్లో సైతం ఈ రైస్‌ను అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఎండీ చింతా రాఘవరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌తోపాటు ఈ ఏడాది అమెరికా మార్కెట్‌కు బ్రౌన్ రైస్ ఎగుమతి చేస్తామన్నారు. మిల్లు విస్తరణకు ఇటీవలే రూ.30 కోట్లు వెచ్చించామంటూ... కొన్ని బ్రాండ్లు బ్రౌన్‌రైస్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, తాము కిలో రూ.32-36కే విక్రయిస్తామని చెప్పారు.
ఏటా 2 లక్షల టన్నులు..తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెంలో శ్రీ మురళి మోహన బాయిల్డ్, రా రైస్ మిల్లును 1983లో ఏర్పాటు చేశారు. 1.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంటున్న ఈ మిల్లు సామర్థ్యం రోజుకు వెయ్యి టన్నులు. ఏటా 2 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తోంది. రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా పలు కిరాణా దుకాణాలతోపాటు మోర్, స్పెన్సర్స్, రిలయన్స్ ఫ్రెష్, మెట్రో తదితర సంస్థలకు వివిధ రకాల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 15 దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తున్న ఈ కంపెనీ... 2014-15లో రూ.750 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.
కాగా థాయ్‌లాండ్‌లో రూ.60 కోట్లు వెచ్చించి రోజుకు 500 టన్నుల సామర్థ్యంగల మిల్లును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాఘవరెడ్డి చెప్పారు. ‘‘ఏపీ ప్రభుత్వం సహకరిస్తే కొమరిపాలెం మిల్లు సామర్థ్యాన్ని మరో 30 కోట్లు వెచ్చించి రోజుకు 1,500 టన్నులకు చేరుస్తాం. ఈ ఏడాది మరో 10 దేశాలకు విస్తరిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు టర్నోవర్‌ను ఆశిస్తున్నాం. 5 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు.