MD posts
-
బ్యాంక్ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు
ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్‌లలో కార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్ని షరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటే తక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకు మించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది. -
లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, ఎండీ పోస్టుల విభజన
► ప్రయోజనాలపై సెబీ కమిటీ అధ్యయనం ► వచ్చే నెలలో నివేదిక న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, ఎండీ పోస్టులను విడదీయడం, వేర్వేరు వ్యక్తులను నియమించడం వల్ల చేకూరే ప్రయోజనాలను బేరీజు వేయడంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిమగ్నమైంది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే నివేదిక కూడా ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐచ్ఛికమే అయినప్పటికీ.. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ‘బోర్డుకు అధిపతిగా చైర్మన్ ఉంటుండగా, బోర్డు పర్యవేక్షణలో ఎండీ పనిచేస్తారు. సీఎండీ బాధ్యతలు రెండింటినీ ఒకరే నిర్వర్తిస్తుండటం వల్ల కొంత గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంది. మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ దిశగా పయనం... రెండు పోస్టులను విడదీయడం మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ దిశగా మంచి చర్యే‘ అని కార్పొరేట్ ప్రొఫెషనల్స్ సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ విజయ్ పేర్కొన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఉన్న వారు.. ఎండీ సహా ఎగ్జిక్యూటివ్‌ల పనితీరుపై నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. ఇది పురోగమన చర్యగా పలు ప్రభుత్వ రంగ బోర్డుల్లో సభ్యుడిగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్ రవి అభివర్ణించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. సెబీ నిబంధనల ప్రకారం ఇప్పటిదాకా లిస్టెడ్ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ రెండు పోస్టుల్లో వేర్వేరు వ్యక్తులను నియమించవచ్చు. సెబీ ఈ నిబంధనను తప్పనిసరి చేయలేదు కానీ.. దీని ప్రయోజనాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించిన అంశాలపై తగు సలహాలు, సూచనలు చేసేందుకు 21 మంది సభ్యులతో ఈ ఏడాది జూన్‌లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కంపెనీలు, స్టాక్ ఎక్సే్చంజీలు, ప్రొఫెషనల్ సంస్థలు, ఇన్వెస్టర్ల బృందాలు, న్యాయవాద సంస్థలు, విద్యావేత్తలు, రీసెర్చ్ నిపుణులతో పాటు సెబీ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. దేశీయంగా రెండు హోదాల్లోనూ ఒకే వ్యక్తి (చాలా సందర్భాల్లో ప్రమోటర్ కుటుంబానికి చెందినవారు) ఉన్న సంస్థలు, స్వచ్ఛందంగానే రెండు పోస్టులను విడదీసిన సంస్థల్లో కార్పొరేట్ విధానాలపై ప్యానెల్ తులనాత్మక పరిశీలన జరుపుతోంది. -
4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు
వేర్వేరుగా చైర్మన్, ఎండీ పోస్టులు యునెటైడ్ బ్యాంక్‌కు తెలుగు ఎండీ,సీఈవో శ్రీనివాస్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను విడగొడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. బుధవారం కొత్తగా నాలుగు బ్యాంకులకు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై పీఎస్‌యూ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు. క్రియాశీలక బాధ్యతలన్నీ మేనేజింగ్ డెరైక్టరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి ఉంటాయి. పార్ట్-టైమ్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాగలదని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. అయితే, బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి మాత్రం ప్రస్తుతం ఉన్న తరహాలోనే ఒక చైర్మన్, పలువురు మేనేజింగ్ డెరైక్టర్ల విధానం అలాగే కొనసాగుతుందని వివరించింది. ఎస్బీఐ మినహా.. ఇతర పీఎస్బీలన్నింటిలోనూ చైర్మన్.. పార్ట్ టైమ్ బోర్డు సభ్యులుగా ఉంటారు. చైర్మన్‌కు ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు ఉండవు. తాజా నియామకాల ప్రకారం యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీ, సీఈవోగా తెలుగువాడైన పి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా ఉన్నారు. 1978లో ఆంధ్రా బ్యాంక్‌లో శ్రీనివాస్ కెరియర్ ప్రారంభించారు. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఆర్ కోటీశ్వరన్‌ను .. ఇండియన్ ఓవ ర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ,సీఈవోగా నియమించారు. అటు అనిమేష్ చౌహాన్ (ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఈడీ).. ఇకపై ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కి, కిషోర్ కుమార్ సాన్సీ (ప్రస్తుతం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీ) విజయ బ్యాంక్‌కు సారథ్యం వహిస్తారు. మూడేళ్ల పాటు లేదా పదవీ విరమణ వయసు తేదీ దాకా (ఏది ముందైతే అది) వీరి నియామకాలు వర్తిస్తాయి. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్కే జైన్ స్థానంలో మరెవరూ నియమితులు కాలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. అటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లకు తగిన అభ్యర్థులు లభించకపోవడంతో ప్రైవేట్ రంగం నుంచి ఎంపిక చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.