లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, ఎండీ పోస్టుల విభజన
► ప్రయోజనాలపై సెబీ కమిటీ అధ్యయనం
► వచ్చే నెలలో నివేదిక
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, ఎండీ పోస్టులను విడదీయడం, వేర్వేరు వ్యక్తులను నియమించడం వల్ల చేకూరే ప్రయోజనాలను బేరీజు వేయడంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిమగ్నమైంది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే నివేదిక కూడా ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐచ్ఛికమే అయినప్పటికీ.. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ‘బోర్డుకు అధిపతిగా చైర్మన్ ఉంటుండగా, బోర్డు పర్యవేక్షణలో ఎండీ పనిచేస్తారు. సీఎండీ బాధ్యతలు రెండింటినీ ఒకరే నిర్వర్తిస్తుండటం వల్ల కొంత గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంది.
మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ దిశగా పయనం...
రెండు పోస్టులను విడదీయడం మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ దిశగా మంచి చర్యే‘ అని కార్పొరేట్ ప్రొఫెషనల్స్ సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ విజయ్ పేర్కొన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఉన్న వారు.. ఎండీ సహా ఎగ్జిక్యూటివ్‌ల పనితీరుపై నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. ఇది పురోగమన చర్యగా పలు ప్రభుత్వ రంగ బోర్డుల్లో సభ్యుడిగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్ రవి అభివర్ణించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. సెబీ నిబంధనల ప్రకారం ఇప్పటిదాకా లిస్టెడ్ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ రెండు పోస్టుల్లో వేర్వేరు వ్యక్తులను నియమించవచ్చు.
సెబీ ఈ నిబంధనను తప్పనిసరి చేయలేదు కానీ.. దీని ప్రయోజనాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించిన అంశాలపై తగు సలహాలు, సూచనలు చేసేందుకు 21 మంది సభ్యులతో ఈ ఏడాది జూన్‌లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కంపెనీలు, స్టాక్ ఎక్సే్చంజీలు, ప్రొఫెషనల్ సంస్థలు, ఇన్వెస్టర్ల బృందాలు, న్యాయవాద సంస్థలు, విద్యావేత్తలు, రీసెర్చ్ నిపుణులతో పాటు సెబీ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. దేశీయంగా రెండు హోదాల్లోనూ ఒకే వ్యక్తి (చాలా సందర్భాల్లో ప్రమోటర్ కుటుంబానికి చెందినవారు) ఉన్న సంస్థలు, స్వచ్ఛందంగానే రెండు పోస్టులను విడదీసిన సంస్థల్లో కార్పొరేట్ విధానాలపై ప్యానెల్ తులనాత్మక పరిశీలన జరుపుతోంది.