4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు | new chief's to 4 banks | Sakshi
Sakshi News home page

4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు

Published Thu, Jan 1 2015 2:32 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు - Sakshi

4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు

వేర్వేరుగా చైర్మన్, ఎండీ పోస్టులు
యునెటైడ్ బ్యాంక్‌కు తెలుగు ఎండీ,సీఈవో శ్రీనివాస్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను విడగొడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. బుధవారం కొత్తగా నాలుగు బ్యాంకులకు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై పీఎస్‌యూ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు.

క్రియాశీలక బాధ్యతలన్నీ మేనేజింగ్ డెరైక్టరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి ఉంటాయి. పార్ట్-టైమ్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాగలదని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. అయితే, బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి మాత్రం ప్రస్తుతం ఉన్న తరహాలోనే ఒక చైర్మన్, పలువురు మేనేజింగ్ డెరైక్టర్ల విధానం అలాగే కొనసాగుతుందని వివరించింది.  ఎస్‌బీఐ మినహా.. ఇతర పీఎస్‌బీలన్నింటిలోనూ చైర్మన్.. పార్ట్ టైమ్ బోర్డు సభ్యులుగా ఉంటారు. చైర్మన్‌కు ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు ఉండవు.
 
తాజా నియామకాల ప్రకారం యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీ, సీఈవోగా తెలుగువాడైన పి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా ఉన్నారు. 1978లో ఆంధ్రా బ్యాంక్‌లో శ్రీనివాస్ కెరియర్ ప్రారంభించారు. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఆర్ కోటీశ్వరన్‌ను .. ఇండియన్ ఓవ ర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ,సీఈవోగా నియమించారు. అటు అనిమేష్ చౌహాన్ (ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఈడీ).. ఇకపై ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కి, కిషోర్ కుమార్ సాన్సీ (ప్రస్తుతం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీ) విజయ బ్యాంక్‌కు సారథ్యం వహిస్తారు. మూడేళ్ల పాటు లేదా పదవీ విరమణ వయసు తేదీ దాకా (ఏది ముందైతే అది) వీరి నియామకాలు వర్తిస్తాయి.
 
అవినీతి ఆరోపణలపై అరెస్టయిన సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్‌కే జైన్ స్థానంలో మరెవరూ నియమితులు కాలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. అటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లకు తగిన అభ్యర్థులు లభించకపోవడంతో ప్రైవేట్ రంగం నుంచి ఎంపిక చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement