united Bank
-
30 శాతం తగ్గిన యునెటైడ్ బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: మొండి బకాయిలు రెట్టింపు కావడంతో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.61.86 కోట్లుగా నమోదు కాగా, తాజాగా అది రూ.43.53 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం సైతం రూ.2,927 కోట్ల నుంచి రూ.2,893 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో వసూలు కాని స్థూల, నికర మొండి బకాయిలు 82 నుంచి 95 శాతం మేర పెరగడం, వాటికి చేసిన నిధుల కేటయింపులతో లాభాలు తరిగినట్టు తెలుస్తోంది. స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) రూ.11,134 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో ఇవి 16.26 శాతానికి సమానం. గతేడాది ఇదే త్రేమాసికంలో ఎన్పీఏలు రూ.6,112 కోట్లు (మొత్తం రుణాల్లో 8.90 శాతం)గానే ఉన్నారుు. నికర ఎన్పీఏలు సైతం రూ.7,185 కోట్లుగా, మొత్తం రుణాల్లో 11.19 శాతంగా ఉన్నాయి. -
యునెటైడ్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: కొన్ని మెచ్యూరిటీ డిపాజిట్లపై వడ్డీరేట్లను యునెటైడ్ బ్యాంక్ తగ్గించింది. పావు శాతం నుంచి అరశాతం వరకూ ఈ రేట్లు తగ్గాయి. తాజా రేట్లు ఈ నెల 21వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. రేటు మారిన మెచ్యూరిటీలను చూస్తే... 181-269 రోజుల మధ్య డిపాజిట్ రేటు 7 శాతంగా ఉండనుంది. ఇప్పటి వరకూ ఈ రేటు 7.25 శాతం. 270 రోజుల నుంచి ఏడాది వరకూ రూ. కోటి వరకూ డిపాజిట్ రేటు 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది. రూ.కోటి వరకూ ఏడాదిలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్ల రేటు పావుశాతం తగ్గి, 7.5 శాతానికి చేరింది. రూ.కోటి పైన డిపాజిట్ రేటు ఈ మెచ్యూరిటీకి సంబంధించి 7.25 శాతంగా ఉండనుంది. కోటి రూపాయల డిపాజిట్ ఏడాది నుంచి ఐదేళ్లపైన వడ్డీరేటు 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది. కాగా, డిపాజిట్ రేటు తగ్గింపు రుణ రేటు తగ్గింపునకు ఒక సంకేతంగా భావిస్తారు. -
యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటు తగ్గింపు
ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించిన ఐడీబీఐ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 10% నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఈ నెల 19 నుంచి ఇది అమలవుతుంది. ఫలితంగా రుణ గ్రహీతలకు ఈఎంఐలు తగ్గే వీలుంది. గత వారంలోనే రిటైల్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ తగ్గించింది. ఒక ఏడాది రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 8 శాతానికి, ఏడాదికి మించిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 7.75 శాతానికి తగ్గించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.55 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపు నేటి(బుధవారం) నుంచే అమల్లోకి వస్తుందని వివరించింది. గత వారంలో కీలక రేట్లను ఆర్బీఐ పావు శాతం తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ తమ బేస్రేట్లను తగ్గించాయి. -
రుణ రేట్ల తగ్గింపు షురూ..!
ఆర్బీఐ అనూహ్య నిర్ణయం రెపోరేటు 8 నుంచి 7.75 శాతానికి... ఈ లబ్ధి వినియోగదారులకు అందించే కసరత్తు! గృహ, వాహన రుణ గ్రహీతలకు ఊరట! న్యూఢిల్లీ: రెపోరేటును పావు శాతం తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలిచ్చాయి. యునెటైడ్ బ్యాంక్ ముందుగా ఈ నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ రుణ రేటు 0.25 శాతం తగ్గించి, ఆర్బీఐ ఇచ్చిన ప్రయోజనాన్ని అంతిమ రుణ గ్రహీతకు బదలాయించింది. దీనితో బ్యాంక్ బేస్‌రేటు (ఈ రేటుకన్నా తక్కువకు బ్యాంకులు రుణాలు మంజూరుచేయవు) 10.25 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగ మార్కెట్ లీడర్ ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు సైతం ఇదే దారిలో ప్రయాణించనున్నట్లు సంకేతాలిస్తున్నాయి. ఇదే జరిగితే గృహ, వాహన రుణాల ‘ఈఎంఐ’లు తగ్గే అవకాశాలున్నాయి. ఆర్బీఐ అనూహ్య నిర్ణయం... ఎవ్వరూ ఊహించిన రీతిలో గురువారం ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ఈ రేటు తగ్గడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే నగదు లభిస్తుంది. ఈ వెసులుబాటును వినియోగదారుకు మళ్లించడం వల్ల వ్యవస్థలో వస్తు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది పారిశ్రామిక రంగం ఉత్పత్తి పెరుగుదలకు, తద్వారా ఆ రంగం వృద్ధికి... అటుపై దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే నగదు (లిక్విడిటీ) భారీగా వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల, ధరలు పెరిగే అవకాశాలూ ఉంటాయి. అందువల్ల ధరలు ఆమోదనీయ స్థాయిలో ఉన్నప్పుడే రెపోరేటును తగ్గించి, బ్యాంకులు కూడా రుణ రేటు తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాలు రెండూ 5 శాతం స్థాయిలో ఉన్నందున... ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర (2013 మే తరువాత) తరవాత ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. రెపో రేటు పావుశాతం తగ్గినందున, దీనికి అనుగుణంగా ఉండే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద స్వల్పకాలికంగా ఉంచే నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు) 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది. కాగా బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 4 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 3న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో, ముందుగానే ఆర్బీఐ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం... ఆర్బీఐ నిర్ణయంపై ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది వృద్ధికి దోహదపడే నిర్ణయమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలోపేతానికి దోహదపడే నిర్ణయమని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ చెప్పారు. ఆర్బీఐ మరింతగా వడ్డీరేట్ల కోతకు సంకేతాలు ఇస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇదొక సానుకూల అనూహ్య నిర్ణయమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. కాగా ఇది హర్షించదగిన పరిణామమే కానీ రేటు కోత 50 బేసిస్ పాయింట్లయితే బాగుండేదని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పీ బాలేంద్రన్ అన్నారు. బ్యాంకర్ల మాటిది... ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ అంశంపై మాట్లాడుతూ, ఆర్బీఐ నిర్ణయంతో రేట్ల కోత (డిపాజిట్, రుణ రేట్లు) తప్పనిసరిగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రేట్ల కోతకు ఇది ప్రారంభం మాత్రమేనన్నారామె. ఇదే అభిప్రాయంతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్ కూడా ఏకీభవించారు. ఆర్బీఐ రేటు తగ్గించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాల్సి ఉందన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పాన్ మాట్లాడుతూ, 2015లో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
విలీనం దిశగా పీఎస్‌యూ బ్యాంకులు
నేటి నుంచి బ్యాంకింగ్ సంస్కరణలపై పూణేలో రెండు రోజుల కీలక సదస్సు లిస్ట్ అయిన అనుబంధ బ్యాంకుల వీలీనంపై ఎస్బీఐ దృష్టి తొలి జాబితాలో యునెటైడ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన సంస్కరణలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పూణే కేంద్రంగా జనవరి 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ‘జ్ఞాన సంగం’ పేరుతో ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, పేరుకుపోయిన మొండి బకాయీలను తగ్గించడం, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా కావల్సిన మూలధన ఏర్పాటు వంటి కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలే ప్రధాన అజెండా అయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఎండీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో పాటు, ఐఆర్డీఏ, పీఎఫ్ ఆర్డీఏ చైర్మన్లు, పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించే ఈ సమావేశాలు రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. మోదీ ఈ సందర్భం గా బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేయడం తో పాటు, పీఎస్‌యూ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడానికి ప్రభుత్వం, బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకు సీఎండీలతో చర్చించనున్నారు. విలీనాలకే మొగ్గు జూలై బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించిన అరుణ్ జైట్లీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జ్ఞాన సంగం సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా వీటిని విలీనం చేయడం ద్వారా 7-8 పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఒకటి రెండు బలహీనమైన బ్యాంకులను బలమైన బ్యాంకులో విలీనం చేయడంతో పాటు, ఒక ఎస్బీఐ అనుబంధ బ్యాంకును విలీనం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా తొమ్మిది నెలలుగా సీఎండీ లేకుండా, రూ. 10 లక్షలు దాటి రుణాలు కూడా ఇవ్వడానికి వీలులేని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ ప్రక్రియ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. యునెటైడ్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. దీని తర్వాత గత త్రైమాసికంలో నష్టాలు ప్రకటించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా, విజయ, యూకో వంటి బ్యాంకుల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. -
4 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు
వేర్వేరుగా చైర్మన్, ఎండీ పోస్టులు యునెటైడ్ బ్యాంక్‌కు తెలుగు ఎండీ,సీఈవో శ్రీనివాస్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను విడగొడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. బుధవారం కొత్తగా నాలుగు బ్యాంకులకు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై పీఎస్‌యూ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు. క్రియాశీలక బాధ్యతలన్నీ మేనేజింగ్ డెరైక్టరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి ఉంటాయి. పార్ట్-టైమ్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాగలదని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. అయితే, బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి మాత్రం ప్రస్తుతం ఉన్న తరహాలోనే ఒక చైర్మన్, పలువురు మేనేజింగ్ డెరైక్టర్ల విధానం అలాగే కొనసాగుతుందని వివరించింది. ఎస్బీఐ మినహా.. ఇతర పీఎస్బీలన్నింటిలోనూ చైర్మన్.. పార్ట్ టైమ్ బోర్డు సభ్యులుగా ఉంటారు. చైర్మన్‌కు ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు ఉండవు. తాజా నియామకాల ప్రకారం యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీ, సీఈవోగా తెలుగువాడైన పి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా ఉన్నారు. 1978లో ఆంధ్రా బ్యాంక్‌లో శ్రీనివాస్ కెరియర్ ప్రారంభించారు. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఆర్ కోటీశ్వరన్‌ను .. ఇండియన్ ఓవ ర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ,సీఈవోగా నియమించారు. అటు అనిమేష్ చౌహాన్ (ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఈడీ).. ఇకపై ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కి, కిషోర్ కుమార్ సాన్సీ (ప్రస్తుతం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీ) విజయ బ్యాంక్‌కు సారథ్యం వహిస్తారు. మూడేళ్ల పాటు లేదా పదవీ విరమణ వయసు తేదీ దాకా (ఏది ముందైతే అది) వీరి నియామకాలు వర్తిస్తాయి. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్కే జైన్ స్థానంలో మరెవరూ నియమితులు కాలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. అటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లకు తగిన అభ్యర్థులు లభించకపోవడంతో ప్రైవేట్ రంగం నుంచి ఎంపిక చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.