యునెటైడ్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: కొన్ని మెచ్యూరిటీ డిపాజిట్లపై వడ్డీరేట్లను యునెటైడ్ బ్యాంక్ తగ్గించింది. పావు శాతం నుంచి అరశాతం వరకూ ఈ రేట్లు తగ్గాయి. తాజా రేట్లు ఈ నెల 21వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. రేటు మారిన మెచ్యూరిటీలను చూస్తే... 181-269 రోజుల మధ్య డిపాజిట్ రేటు 7 శాతంగా ఉండనుంది. ఇప్పటి వరకూ ఈ రేటు 7.25 శాతం. 270 రోజుల నుంచి ఏడాది వరకూ రూ. కోటి వరకూ డిపాజిట్ రేటు 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది. రూ.కోటి వరకూ ఏడాదిలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్ల రేటు పావుశాతం తగ్గి, 7.5 శాతానికి చేరింది. రూ.కోటి పైన డిపాజిట్ రేటు ఈ మెచ్యూరిటీకి సంబంధించి 7.25 శాతంగా ఉండనుంది. కోటి రూపాయల డిపాజిట్ ఏడాది నుంచి ఐదేళ్లపైన వడ్డీరేటు 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది. కాగా, డిపాజిట్ రేటు తగ్గింపు రుణ రేటు తగ్గింపునకు ఒక సంకేతంగా భావిస్తారు.