రుణ రేట్ల తగ్గింపు షురూ..! | As RBI cuts rate, should you go for fixed home loan? | Sakshi
Sakshi News home page

రుణ రేట్ల తగ్గింపు షురూ..!

Published Sat, Jan 17 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

రుణ రేట్ల తగ్గింపు షురూ..!

రుణ రేట్ల తగ్గింపు షురూ..!

ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం
  రెపోరేటు 8 నుంచి 7.75 శాతానికి...
  ఈ లబ్ధి వినియోగదారులకు అందించే కసరత్తు!
  గృహ, వాహన రుణ గ్రహీతలకు ఊరట!
 
 న్యూఢిల్లీ: రెపోరేటును పావు శాతం తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలిచ్చాయి. యునెటైడ్ బ్యాంక్ ముందుగా ఈ నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ రుణ రేటు 0.25 శాతం తగ్గించి, ఆర్‌బీఐ ఇచ్చిన ప్రయోజనాన్ని అంతిమ రుణ గ్రహీతకు బదలాయించింది. దీనితో బ్యాంక్ బేస్‌రేటు (ఈ రేటుకన్నా తక్కువకు బ్యాంకులు రుణాలు మంజూరుచేయవు) 10.25 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగ మార్కెట్ లీడర్ ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు సైతం ఇదే దారిలో ప్రయాణించనున్నట్లు సంకేతాలిస్తున్నాయి. ఇదే జరిగితే గృహ, వాహన రుణాల ‘ఈఎంఐ’లు తగ్గే అవకాశాలున్నాయి.
 
 ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం...
 ఎవ్వరూ ఊహించిన రీతిలో గురువారం ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ఈ రేటు తగ్గడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే నగదు లభిస్తుంది. ఈ వెసులుబాటును వినియోగదారుకు మళ్లించడం వల్ల వ్యవస్థలో వస్తు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది పారిశ్రామిక రంగం ఉత్పత్తి పెరుగుదలకు, తద్వారా ఆ రంగం వృద్ధికి... అటుపై దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే నగదు (లిక్విడిటీ) భారీగా వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల, ధరలు పెరిగే అవకాశాలూ ఉంటాయి. అందువల్ల ధరలు ఆమోదనీయ స్థాయిలో ఉన్నప్పుడే రెపోరేటును తగ్గించి, బ్యాంకులు కూడా రుణ రేటు తగ్గించేలా ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది.
 
 ప్రస్తుతం టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాలు రెండూ 5 శాతం స్థాయిలో ఉన్నందున... ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర (2013 మే తరువాత) తరవాత ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. రెపో రేటు పావుశాతం తగ్గినందున, దీనికి అనుగుణంగా ఉండే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద స్వల్పకాలికంగా ఉంచే నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు) 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది. కాగా బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 4 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 3న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో, ముందుగానే ఆర్‌బీఐ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
 
 పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం...
 ఆర్‌బీఐ నిర్ణయంపై ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది వృద్ధికి దోహదపడే నిర్ణయమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలోపేతానికి దోహదపడే నిర్ణయమని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ చెప్పారు. ఆర్‌బీఐ మరింతగా వడ్డీరేట్ల కోతకు సంకేతాలు ఇస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇదొక సానుకూల అనూహ్య నిర్ణయమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. కాగా ఇది హర్షించదగిన పరిణామమే కానీ రేటు కోత 50 బేసిస్ పాయింట్లయితే బాగుండేదని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పీ బాలేంద్రన్ అన్నారు.
 
 బ్యాంకర్ల మాటిది...
 ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ అంశంపై మాట్లాడుతూ, ఆర్‌బీఐ నిర్ణయంతో రేట్ల కోత (డిపాజిట్, రుణ రేట్లు) తప్పనిసరిగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రేట్ల కోతకు ఇది ప్రారంభం మాత్రమేనన్నారామె. ఇదే అభిప్రాయంతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్ కూడా ఏకీభవించారు. ఆర్‌బీఐ రేటు తగ్గించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాల్సి ఉందన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పాన్ మాట్లాడుతూ, 2015లో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement