గింజలులేని పుచ్చకాయ తెలుసా!
కొచ్చి: వేసవి తాపం తీరాలంటే పుచ్చకాయను మించిన పండు మరొకటి లేదు. రుచికి రుచి.. పోషకాలు కూడా మెండుగా ఉన్న పుచ్చకాయలో ఎవరికైనా నచ్చని ఒకేఒక్క విషయం గింజలు. ఎంతో ఇష్టంగా తింటుంటే .. పంటికింద రాయిలా గింజలు అడ్డుపడుతుంటాయి. మరి ఈ గింజలే లేని పుచ్చకాయ ఉంటే ఎంతో బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే మీ కోరిక తీరాలంటే మీరు కేరళ వెళ్లాల్సిందే.
ఎందుకంటే ఇప్పుడు కేరళ మార్కెట్లో గింజలు లేని పుచ్చకాయలు దొరుకుతున్నాయి. కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. పిరావామ్లోని ఐదున్నర ఎకరాల్లో ఈ కాయలను పండించింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ పుచ్చకాయలకు భలే డిమాండ్ ఉందట. ఇంకెల్ అనే సంస్థ వీటిని పండిస్తోంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పుచ్చకాయలను పండించామని ఆ సంస్థ ఎండీ టి. బాలకృష్ణన్ తెలిపారు.