చరితార్థుల చిత్రపటం
తాజా పుస్తకం
గుల్జార్ తీసిన ‘మేచిస్’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది- ‘మనకు స్వాతంత్య్రం తెచ్చింది ఎవరు అని అడిగితే అందరూ గాంధీజీ అని సమాధానం చెప్తారు... గాంధీజీ ఒక్కడేనా మనకు స్వాతంత్య్రం తెచ్చింది?’
అవును. గాంధీజీ ఒక్కడేనా మనకు స్వాతంత్య్రం తెచ్చింది. పోనీ నెహ్రూ, నేతాజీ, పటేల్, భగత్ సింగ్... వీళ్లు మాత్రమేనా? ఎన్ని చేతులు ఖండితమైతే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎన్ని కాళ్లు గమ్యం వైపు నడిస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎన్ని వేల లక్షల కంఠాలు ఖంగున మోగితే ఈ స్వాతంత్య్రం వచ్చింది. ఎందరు అజ్ఞాతవీరులు తమ జీవితాలను త్యాగం చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. గెలుపుకు హక్కుదారులుగా నాయకులను చూడటానికే చరిత్ర అంగీకరిస్తుంది. బంట్లను నిరాకరిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు చేసిన పోరాటంపై వారి త్యాగంపై పడవలసినంత వెలుగు పడిందా?
జరగవలసినంత ప్రచారం జరిగిందా? మహమ్మద్ అలీ జిన్నా, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జాకీర్ హుసేన్... ఈ ముగ్గురు నలుగురు మాత్రమేనా ముస్లింలలో నాయకులు. ఇది సరైన ప్రాతినిధ్యమేనా? కాదు అనంటారు ‘చరితార్థులు’ రచయిత సయ్యద్ నసీర్ అహమద్. ఈ దేశంపై ముస్లింల హక్కును నిరాకరించే, ఈ దేశ నిర్మాణంలో ముస్లింల కృషిని చిన్నచూపు చూసే, వారిని న్యూనతతో మూలకు నెట్టివేసే కుత్సితాలు కొన్ని జరుగుతున్న దరిమిలా ముస్లింలు ఎందులోనూ తక్కువకారని ముఖ్యంగా స్వాతంత్య్రపోరాటంలో వారు గొప్ప త్యాగం, పోరాటం చేశారని ఇప్పటికే పలు పుస్తకాలతో నిరూపించిన నశీర్ అహమద్ ఇప్పుడు తాజాగా ‘చరితార్థులు’ పేరుతో 156 మంది ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పరిచయాలను గుది గుచ్చి తన వాదనను మరికాస్త గట్టిగా వినిపించారు.
ఈస్టిండియా కంపెనీపై తొలి ఖడ్గం ఎత్తి అమరుడైన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, ‘క్యాష్ బ్యాగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’గా గాంధీజీ చేత ప్రశంసలు పొంది తన గొప్ప వితరణతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన హజీ ఉస్మాన్ సేట్, గాంధీజీ చేత ‘సంపూర్ణ స్వరాజ్యం’ నినాదాన్ని ఒప్పించిన మౌలానా హస్రత్ మోహనీ, గాంధీజీ మీద విషప్రయోగం చేయమని ఆశ జూపిన బ్రిటిష్‌వారిని ఎదిరించి గాంధీజీకి ఈ సంగతి చెప్పి ఆయన ప్రాణాలు కాపాడి ఉద్యోగం పోగొట్టుకొని గర్భ దరిద్రంలో మగ్గిన బతఖ్ మియా అన్సారి, హైదరాబాద్ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో కలపాలని ఉద్యమాన్ని లేవదీసి నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన సయ్యద్ నాసిర్ హసన్, తన కవితా జ్వాలలతో ఉద్యమాన్ని రగిలించిన మగ్దూమ్ మొహియుద్దీన్, సుభాష్ చంద్రబోస్‌కు ‘నేతాజీ’ బిరుదు ఇచ్చి ఆయన వెన్నంటే ఉండి ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించిన ఆబిద్ హసన్ సఫ్రాని... ఎందరని.
ఎన్నో కాగడాలు మండి బ్రిటిష్ రాజ్యాధికారాన్ని దహించాయి. ఎన్నో గొప్ప మూర్తిమత్వాలు పంతం పట్టి తెల్లవాళ్లను తరిమికొట్టాయి. ఇవాళ కాకపోతే రేపు ఈనాడు కాకపోతే మరునాడు వీరందరూ వెలుగులోకి రావలసిందే. నాయకులకు ఇచ్చే గౌరవం నేతలది. కాని వెంట ఉండి బలం ఇచ్చిన సిపాయిలకు ఇవ్వాల్సిన గౌరవం సిపాయిలది. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా లక్షలాది మంది చేసిన త్యాగఫలం మన స్వాతంత్య్రం. దేశం కోసం పని చేసిన వారందరి కృషినీ వెలికి తెచ్చే ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ప్రతి పేరునూ దీపంగా చేసి వెలిగించాలి.
ముస్లింలలో అలాంటి చరితార్థులను ఎన్నో వ్యయప్రయాసలతో తిరిగి పాఠకులకు అందించిన ఈ ప్రయత్నం గౌరవనీయమైనది. ప్రతి చరిత్ర అధ్యాపకుడు, ఔత్సాహిక సామాజిక పరిశీలకుడు, పరిశోధకుడు తప్పక పరిశీలించ దగ్గ గ్రంథం ఇది. ఈ పుస్తకంలో సమాచారం ఒక ఎత్తయితే చిత్రకారుడు జస్టిస్ వేసిన ముఖచిత్రాలు ఒక ఎత్తు. ఆ మహనీయులను తన పెన్సిల్ రేఖలలో సజీవంగా సమర్థంగా చూపించారు. ఇటీవలి తెలుగు పరిశోధన గ్రంథాలలో ఒక మంచి ప్రయత్నం - చరితార్థులు.
చరితార్థులు- బ్రిటిష్ పాలకులను ఎదిరించిన
ముస్లిం యోధులు
రచన: సయ్యద్ నసీర్ అహమద్; బొమ్మలు: జస్టిస్
వెల: రూ.1000; ప్రతులకు: 9440241727
- నెటిజన్ కిశోర్