Medak DEO
-
మెదక్ డీఈఓకు సన్మానం
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా విద్యాధికారి(డీఈఓ)గా నియమితులైన మెదక్ పట్టణానికి చెందిన శివ్వ రమేష్ బాబును శనివారం ఘనంగా సన్మానించారు. శనివారం డీఈఓను ఆయన ఇంట్లో కలిసి కౌన్సిలర్ ఆర్కె శ్రీనివాస్ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో మచ్చలేని వ్యక్తిగా ఉన్న రమేష్‌బాబు ఎంతోప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. లెక్చరర్‌గా, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా, డిప్యూటీ ఈఓగా పనిచేసిన రమేష్‌బాబు డీఈఓగా ప్రమోషన్ పొందడం మెదక్ పట్టణానికే గర్వకారణమన్నారు. రమేష్‌బాబు మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తొడుపునూరి శివరామకృష్ణ, కొండశ్రీనివాస్, నరెందర్, బిక్షపతి, టిన్ను తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ డీఈవోపై చర్యలు తీసుకోండి!
* ప్రభుత్వానికి విద్యాశాఖ సిఫారసు * చర్యల విషయంలో సర్కారు పిల్లిమొగ్గలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరిగినందున మెదక్ జిల్లా డీఈవోపై చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత శనివారమే దీనికి సంబంధించిన ఫైలును విద్యాశాఖ ప్రభుత్వానికి పంపగా, మరికొన్ని అంశాలపై వివరణలు కావాలంటూ సోమవారం ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. దీంతో వాటిపై విద్యాశాఖ దృష్టి సారించింది. వాస్తవానికి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లోనే రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి జిల్లా అయిన వరంగల్‌తోపాటు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వరంగల్‌లో ఓ ఎమ్మెల్యే డీఈవో కార్యాలయానికి వచ్చి గొడవ చేయడంతో అక్కడ జరిగిన తప్పిదాలపై విద్యాశాఖ వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో వరంగల్ డీఈవో నలుగురు టీచర్లకు సంబంధించిన స్థానాలను బదిలీల తరువాత మార్పు చేసినట్లు తేలింది. ఆయనపై చర్యలకు విద్యాశాఖ సిఫారసు చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. మెదక్ జిల్లాలో అంతకంటే ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, విచారణలోనూ అవి బయటపడటంతో విద్యాశాఖ ఆయనపైనా చర్యలకు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మెదక్ డీఈవోపై చర్యలు చేపట్టేందుకు మాత్రం వెనుకాడుతున్నట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ విషయంలో మంత్రి కడియం శ్రీహరిపైనా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చర్యలు చేపట్టడం లేదని, వివరణల పేరుతో కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పలుకుబడి లేని వరంగల్ డీఈవోపై వెంటనే చర్యలు చేపట్టిన ప్రభుత్వం పలుకుబడి కలిగిన మెదక్ డీఈవోపై చర్యలు చేపట్టేందుకు వెనుకంజ వేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలో ఒక ఉర్దూ మీడియం స్కూల్‌ను రద్దు చేసి, ఉర్దూ మీడియం లేని స్కూల్లో ఉర్దూ టీచర్లను వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకుడి నేతృత్వంలో భారీ ముడుపుల బాగోతం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మెదక్ డీఈవో సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. -
వరంగల్ డీఈవో సస్పెన్షన్
* రేపో మాపో మెదక్ డీఈవోపైనా వేటు! * టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత బదిలీల స్థానాలను మార్పు చేసినందుకు వరంగల్ డీఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే మార్పులకు పాల్పడినట్లు.. భారీగా ముడుపులు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టిన విద్యా శాఖ బదిలీ అయినవారి స్థానాలను మార్చేసినట్లు తేలడంతో తదుపరి చర్యలకోసం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసి జిల్లాను వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. వరంగల్ ఆర్జేడీని ఇన్చార్జి డీఈవోగా నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 135 జారీ చేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు డీఈవోలు తెరతీయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వరంగల్‌తోపాటు సీఎం కేసీఆర్ జిల్లా అయిన మెదక్‌లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాగా, వరంగల్ డీఈవోను సస్పెండ్ చేయగా, మెదక్ డీఈవో రాజేశ్వర్‌రావు నేతృత్వంలో జరిగిన బదిలీల్లో అక్రమాలపైనా పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. హేతుబద్దీకరణ ఉత్తర్వుల ప్రకారం ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయవద్దని నిబంధనలు ఉన్నా.. ఒక ఉర్దూ స్కూల్‌ను రేషనలైజే షన్లో రద్దు చేసి, అందులోని టీచర్లను హైదరాబాద్ సమీపంలోని స్కూళ్లకు పంపించిన ట్లు ఆరోపణలున్నాయి. అయా స్కూళ్లలో ఉర్దూ మీడియం లేకపోయినా కావాలనే హైదరాబాద్ సమీపానికి బదిలీ చేసినట్లు తెలుస్తోం ది. ఈ వ్యవహారంలోనూ భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. విచారణ బృందం ఆదివారం లేదా సోమవారం నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. దీంతో ఆయనపైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబా ద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాల్లో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత డీఈవోలపై ఎలాంటి చర్యలు చేపడతారన్నది వేచి చూడాల్సిందే.