* ప్రభుత్వానికి విద్యాశాఖ సిఫారసు
* చర్యల విషయంలో సర్కారు పిల్లిమొగ్గలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరిగినందున మెదక్ జిల్లా డీఈవోపై చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత శనివారమే దీనికి సంబంధించిన ఫైలును విద్యాశాఖ ప్రభుత్వానికి పంపగా, మరికొన్ని అంశాలపై వివరణలు కావాలంటూ సోమవారం ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. దీంతో వాటిపై విద్యాశాఖ దృష్టి సారించింది.
వాస్తవానికి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లోనే రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి జిల్లా అయిన వరంగల్‌తోపాటు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వరంగల్‌లో ఓ ఎమ్మెల్యే డీఈవో కార్యాలయానికి వచ్చి గొడవ చేయడంతో అక్కడ జరిగిన తప్పిదాలపై విద్యాశాఖ వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో వరంగల్ డీఈవో నలుగురు టీచర్లకు సంబంధించిన స్థానాలను బదిలీల తరువాత మార్పు చేసినట్లు తేలింది. ఆయనపై చర్యలకు విద్యాశాఖ సిఫారసు చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది.
మెదక్ జిల్లాలో అంతకంటే ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, విచారణలోనూ అవి బయటపడటంతో విద్యాశాఖ ఆయనపైనా చర్యలకు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మెదక్ డీఈవోపై చర్యలు చేపట్టేందుకు మాత్రం వెనుకాడుతున్నట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ విషయంలో మంత్రి కడియం శ్రీహరిపైనా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చర్యలు చేపట్టడం లేదని, వివరణల పేరుతో కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజకీయ పలుకుబడి లేని వరంగల్ డీఈవోపై వెంటనే చర్యలు చేపట్టిన ప్రభుత్వం పలుకుబడి కలిగిన మెదక్ డీఈవోపై చర్యలు చేపట్టేందుకు వెనుకంజ వేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలో ఒక ఉర్దూ మీడియం స్కూల్‌ను రద్దు చేసి, ఉర్దూ మీడియం లేని స్కూల్లో ఉర్దూ టీచర్లను వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకుడి నేతృత్వంలో భారీ ముడుపుల బాగోతం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మెదక్ డీఈవో సోమవారం సీఎం కేసీఆర్‌ను కలిశారని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు.
మెదక్ డీఈవోపై చర్యలు తీసుకోండి!
Published Tue, Aug 4 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement