కృష్ణా పుష్కరాలకు 31 బస్సులు
మెదక్ డిపో డీఎం శ్రీనివాస్
మెదక్: ఈనెల 12నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలకు మెదక్ డిపో నుంచి 31 బస్సులను ప్రత్యేకంగా నడిపించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో పుష్కరాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాలకోసం ఎంత ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపడుతుందో ఆర్టీసీ కూడా అదేస్థాయిలో చర్యలు తీసుకుంటోందన్నారు.
పుష్కరాలకోసం 30మంది ఉంటే ఆ గ్రామానికి వెళ్లి ప్రయాణికులను పుష్కరాలకు తరలిస్తామన్నారు. పుష్కరాలకోసం మహబూబ్నగర్ జిల్లాలోని బీచుపల్లి, శ్రీశైలం, నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లిలో స్నానాల ఘాట్లు ఏర్పాటు చేశారన్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.370 నుంచి 470ల చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో టీఎంయూ నాయకులు ఎంఆర్కేరావు, బోస్, మొగులయ్య, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.