Medak Hospital
-
కరోనా కట్టడిలో విఫలం
సాక్షి, మెదక్: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలి తన ఫాంహౌస్‌లో పడుకున్నారని దుయ్యబట్టారు. శనివారం మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కోవిడ్ బాధితులకు వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యుల పోస్టుల ఖాళీలను సూపరింటెండెంట్ పీసీ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కారణంగా జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కరోనా పరీక్షలు అధికంగా జరపాలన్నందుకు గవర్నర్‌నే విమర్శించిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ప్రతిపక్షాలతో పాటు కోర్టులపై సైతం మాటలతో ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రశ్నించినా సీఎం జీర్ణించుకునే స్థితిలో లేరన్నారు. ఆరున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, ఆయన కుటుంబం మాత్రం దోచుకుని దాచుకోవటంలో విజయం సాధించిందని విమర్శించారు. రోగం వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలు అందించాల్సింది పోయి వారి ఇళ్లకు పంపటం ఎంత వరకు సమంజసమన్నారు. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2న సీఎం అపాయింట్మెంట్ కోరానని, ఆయన తనను కలిసేందుకు అనుమతిస్తే రాష్ట్ర అభివృద్ధిపై, గతంలో ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడతానని, లేనిచో ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. -
బతికి ఉండగానే చనిపోయినట్లు డాక్టర్ ధ్రువీకరణ
సాక్షి, సంగారెడ్డి: బతికి ఉన్న మహిళను చనిపోయిందని ధ్రువీకరించిన డ్యూటీలో ఉన్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లను సస్పెండ్ చేయాలని మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ ఆర్ఎం మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ సోమవారం గంగారం గ్రామానికి చెందినటువంటి వనపర్తి అమృతమ్మ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగులమందు సేవించిందని, దీంతో ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. అమృతమ్మ బతికుండగా ఆమెను చనిపోయిందని ధ్రువీకరించి ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని డాక్టర్లు వివరించిన తీరు సరైంది కాదన్నారు. కావున డాక్టర్‌పై సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్ మండల కార్యదర్శి కే రాజయ్య గంగారం గ్రామ సర్పంచ్ నర్సింలు, సీపీఎం నాయకులు రాంచందర్ భాగయ్య ఎల్లయ్య సత్యం నాగేందర్ స్పందన మానవ హక్కుల సంఘం కొండాపూర్ మండల అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి శ్రీరామరక్ష
మెదక్‌జోన్: ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానాకు అన్న ప్రజలు నేడు క్యూ.. కడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందుతోంది. దీంతో ఏ సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పటిల్‌కు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రి వైపు చూస్తున్నారు. ఈ వైద్యశాలలో ఏడాదికాలంలో ఐదు వేల శస్త్రచికిత్సలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. మెదటి స్థానంలో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రి ఉంది. సగటున నెలకు నాలుగువందల నుంచి 430 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. ఇందులో అపెండెక్స్, వరిబీజం, థైరాయిడ్, కంటి సమస్యలకు, ఎముకలు విరిగినా శస్త్ర చికిత్స ద్వారా సరిచేయడం, గర్భిణులకు సర్జరీ చేసి పురుడుపోయడం లాంటి అనేక రకాల రకాల ఆపరేషన్లు చేస్తూ నిరుపేదలకు భరోస కలిగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 100 పడకలు కాగా ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం నియమించిన సిబ్బందితోనే ఇంతకాలంగా ఆస్పత్రిని నడిపించారు. నాలుగు నెలల క్రితం సరిపడ వైద్యులను నియమించారు. అయినా నేటికీ పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్‌తో పాటు ల్యాబ్‌టెక్నిషన్స్ తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొంటున్నారు. ఐసీయూలో అత్యవసర చికిత్సఏడాది క్రితం అత్యవసర చికిత్స విభాగంవిభాగం(ఐసీయూ)ని ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులు, పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడిన రోగులకు అన్నిరకాల శస్త్రచికిత్సలు అందుతున్నాయి. వెంటిలెటర్ అందుబాటులో ఉండటంతో రోగుల ప్రాణాలకు భరోసాకలిగే విధంగా వైద్యం అందుతోంది. దీంతో వేలాది శస్త్రచిత్సలతోపాటు అన్నిరకాల వ్యాధులను నయం చేస్తున్నారు. డయాలసిస్‌తో.. ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కిడ్నీ వాధిగ్రస్థులకు స్థానికంగానే డయాలసిస్ చేస్తూ చికిత్స అందిస్తున్నారు. ఈ డయాలసిస్ కేంద్రంలో ఒకేసారి ఐదుగురికి డయాలసీస్‌ను నిర్వహించే వెసులు బాటు ఉండటంతో చికిత్స త్వరతగతిన అందుతోంది. జిల్లా వ్యాప్తంగా 35 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గతంలో డయాలసిస్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లేవారు. మాతాశిశు ఆస్పత్రికి శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రూ.17 కోట్లను మంజూరు చేయించారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా శంశుస్థాపనను సైతం చేయించారు. ఇందుకు సంబంధించి టెండర్ పక్రియ జిల్లాకేంద్ర ఆస్పత్రిలోనే జరిగింది. కానీ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోవడం లేదనే సందిగ్ధంలో కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలిసింది. ఈ మాతా శిశుఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే మాతాశిశు వ్యాధులకు ఇక్కడే పూర్తిస్థాయి చికిత్సలు అందే అవకాశం ఉంది. దీంతో మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. కంటి జబ్బుల నివారణ కోసం... కంటి జబ్బుల నివారణకోసం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా నిర్మించేందుకు 20 పడకల ఆస్పత్రి నిర్మాణంకోసం రూ.20 లక్షలు మంజూరి కాగా ప్రస్తుతం ఆస్పత్రిపై భాగంలో మొదటి అంతస్తుగా కంటివెలుగు ఆస్పత్రిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. త్వరలో నిర్మాణం పూర్తికానుంది. ఇది పూర్తయితే కంటిజబ్బు వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకమైన చికిత్సలు అందే అవకాశం ఉంది. -
108 డోరు తెరుచుకోక గర్బిణి అవస్థలు
-
తెరుచుకోని '108' డోరు.. గర్భిణి అవస్థలు
మెదక్: 108 అంబులెన్స్ ల దుస్థితి ఎలా ఉందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది.108 డోర్ తెరుచుకోకపోవడంతో నిండు గర్భిణి అరగంట పాటు విలవిల్లాడిన సంఘటన మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన మమత నిండు గర్భిణి. ఉదయం నుంచి ఆమెకు నొప్పులు మొదలవడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. ఆమెను ఎక్కించుకున్న అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకున్నాక వాహనం తలుపులు తెరుచుకోలేదు. దీంతో అరగంట పాటు మమత నొప్పులతో యాతన అనుభవించింది. గమనించిన అస్సత్రి సిబ్బంది అంబులెన్స్ డోర్‌ను కర్రలు, ఇనుపరాడ్డుల సాయంతో బద్దలు కొట్టి గర్భిణిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై స్తానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసవానికి వెళితే రక్తం తెచ్చుకోమన్నారు..!
* దేవుడి మీద భారం వేసి వెనుదిరిగిన గర్భవతి * ఆర్టీసీ బస్సులోనే ప్రసవం జోగిపేట : ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వె ళితే.. అక్కడి సిబ్బంది రక్తం తెచ్చుకోవాలని సూచించడంతో ఆర్థిక పరిస్థితులు సహకరించ వెను తిరగ్గా బస్సులోనే ఓ మహిళ ప్రసవించింది. వివరాలు ఇలాఉన్నాయి.. మెదక్ మండలం హవేళి ఘనపూర్‌కు చెందిన పూసల శేకమ్మ గర్భవతి కాగా నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను శనివారం మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు శేకమ్మను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి తీసుకెళ్లారు. శేకమ్మకు ఒక వేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇందుకు అవసరమైన ఏ పాజిటివ్ రక్తం అందుబాటులో లేదని, ఎంఎన్ఆర్ ఆస్పత్రికి వెళ్లి తె చ్చుకోవాలని సూచించారు. ఇందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక ఆదివారం ఉదయం దేవుడి మీద భారమేసి ఇంటికి వెళ్లేందుకు సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జడ్ 1038)ను ఎక్కారు. బస్సు పుల్కల్ మండలం సరాఫ్పల్లి జేఎన్టీయూ వద్దకు రాగానే శేకమ్మ పండంటి ఆడపిల్లను ప్రసవించింది. దీంతో బస్సును డ్రైవర్ యాదగిరి, కండక్టర్ సుగుణలు నేరుగా జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, శేకమ్మకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పి సంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో శే కమ్మ భర్త రవి, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము సంగారెడ్డికి పోమని, ఇంటికి వెళతామని రవి, కుటుంబ సభ్యులు శేకమ్మను తీసుకుని వర్షంలోనే బాలింత, పసికందుతో కలిసి ఆస్పత్రి నుంచి బయటపడ్డారు. రక్తం స్టాక్ లేక తెచ్చుకోమన్నాం పేషెంట్‌కు హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నందున ఒక వేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే రక్తం అవసరమని చెప్పామని చెప్పాం. ఆమెది ఏ పాజిటివ్ రక్తం కావడంతో ఆస్పత్రిలో స్టాక్ లేనందున తెచ్చుకోవాలని కోరాం. వారు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. - డాక్టర్ రాజు, సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి