ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
సాక్షి, సంగారెడ్డి: బతికి ఉన్న మహిళను చనిపోయిందని ధ్రువీకరించిన డ్యూటీలో ఉన్న డాక్టర్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లను సస్పెండ్ చేయాలని మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ ఆర్‌ఎం మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ సోమవారం గంగారం గ్రామానికి చెందినటువంటి వనపర్తి అమృతమ్మ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగులమందు సేవించిందని, దీంతో ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.
అమృతమ్మ బతికుండగా ఆమెను చనిపోయిందని ధ్రువీకరించి ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని డాక్టర్లు వివరించిన తీరు సరైంది కాదన్నారు. కావున డాక్టర్‌పై సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్ మండల కార్యదర్శి కే రాజయ్య గంగారం గ్రామ సర్పంచ్ నర్సింలు, సీపీఎం నాయకులు రాంచందర్ భాగయ్య ఎల్లయ్య సత్యం నాగేందర్ స్పందన మానవ హక్కుల సంఘం కొండాపూర్ మండల అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment