
సూపరింటెండెంట్లతో సమావేశమైన జయరాంరెడ్డి
సంగారెడ్డి టౌన్: ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వచ్చే పేదలకు ఓ డాక్టరమ్మ నరకం చూపిస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. ప్రసవం సమయంలో పెద్ద మనసుతో వ్యవహరించాల్సిన వైద్యురాలు గిచ్చుడు, గిల్లుడు, చెంపలపై కొట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సదరు గైనకాలజిస్ట్‌పై వేటు వేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో సదరు గైనకాలజిస్ట్‌ను పటాన్‌చెరు బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి తెలిపారు.
మమ్మల్ని కాపాడేదెవరు..
జిల్లా ఆసుపత్రిలో తరచూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. పెషేంట్లను కాపాడటమే తమ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రసవానికి వచ్చే గర్భిణి, పుట్టబోయే బిడ్డను కాపాడటం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రసవం సమయంలో తల్లి ఆవేదన ఎలా ఉంటుందో తమకు తెలుసని, ఒక వేళ బిడ్డగాని, తల్లి గాని ప్రాణాలు కోల్పోతే తమపై దాడి జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వైద్యురాలు కూడ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తోటి వైద్యులు తెలిపారు. ఉన్నత చదువులు చదివినా తాము రోగులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో తమకే తెలుసని ఆవేదన వెల్లగక్కారు.
వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీకమిషనర్ ఆరా
సంగారెడ్డి జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై తరచూ పత్రికల్లో వస్తున్న కథనాలపై వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి ఆరా తీశారు. జిల్లా ఆసుపత్రిలో పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, సంగారెడ్డి సూపరింటెండెంట్లతో సమావేశమై ఇటీవలి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గర్భిణుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు.