ప్రసవానికి వెళితే రక్తం తెచ్చుకోమన్నారు..!
* దేవుడి మీద భారం వేసి వెనుదిరిగిన గర్భవతి
* ఆర్టీసీ బస్సులోనే ప్రసవం
జోగిపేట : ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వె ళితే.. అక్కడి సిబ్బంది రక్తం తెచ్చుకోవాలని సూచించడంతో ఆర్థిక పరిస్థితులు సహకరించ వెను తిరగ్గా బస్సులోనే ఓ మహిళ ప్రసవించింది. వివరాలు ఇలాఉన్నాయి.. మెదక్ మండలం హవేళి ఘనపూర్‌కు చెందిన పూసల శేకమ్మ గర్భవతి కాగా నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను శనివారం మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు శేకమ్మను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి తీసుకెళ్లారు. శేకమ్మకు ఒక వేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇందుకు అవసరమైన ఏ పాజిటివ్ రక్తం అందుబాటులో లేదని, ఎంఎన్‌ఆర్ ఆస్పత్రికి వెళ్లి తె చ్చుకోవాలని సూచించారు.
ఇందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక ఆదివారం ఉదయం దేవుడి మీద భారమేసి ఇంటికి వెళ్లేందుకు సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జడ్ 1038)ను ఎక్కారు. బస్సు పుల్కల్ మండలం సరాఫ్‌పల్లి జేఎన్‌టీయూ వద్దకు రాగానే శేకమ్మ పండంటి ఆడపిల్లను ప్రసవించింది. దీంతో బస్సును డ్రైవర్ యాదగిరి, కండక్టర్ సుగుణలు నేరుగా జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, శేకమ్మకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పి సంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో శే కమ్మ భర్త రవి, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము సంగారెడ్డికి పోమని, ఇంటికి వెళతామని రవి, కుటుంబ సభ్యులు శేకమ్మను తీసుకుని వర్షంలోనే బాలింత, పసికందుతో కలిసి ఆస్పత్రి నుంచి బయటపడ్డారు.
రక్తం స్టాక్ లేక తెచ్చుకోమన్నాం
పేషెంట్‌కు హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నందున ఒక వేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే రక్తం అవసరమని చెప్పామని చెప్పాం. ఆమెది ఏ పాజిటివ్ రక్తం కావడంతో ఆస్పత్రిలో స్టాక్ లేనందున తెచ్చుకోవాలని కోరాం. వారు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.
- డాక్టర్ రాజు, సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి