Medhomathana Conference
-
ముగిసిన ‘మేధోమథనం’
ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ సదస్సు సోమవారం ముగిసింది. మండల పరిధిలోని శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కళాశాల ప్రాంగణంలో రెండోరోజు సదస్సు ఉదయం 10:45 నిమిషాలకు ప్రారంభమైంది. మొదటగా మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఐదు రోజులుగా మేధోమథన సదస్సు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులు దానం నాగేందర్, సుధీర్‌రెడ్డి, క్యామ మల్లేష్ తదితరులకు ధన్యవాదాలతో సభ ప్రారంభమయింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సదస్సు ప్రారంభంలో ఉండి అగ్ర నాయకులకు ఆహ్వానం పలికారు. మేరా దోస్త్ ఆగయా..: సదస్సు ప్రారంభం కాకముందు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి బయట నిలుచున్నప్పుడు అటుగా జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తన కారులో వస్తుండగా అక్కడున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జీవన్‌రెడ్డిని చూస్తూ.. మేరా దోస్త్ ఆగ యా అన్నారు. కారు దిగిన జీవన్‌రెడ్డి.. ఎలా ఉన్నావు దోస్త్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడున్న నాయకులు వారిద్దరి స్నేహం గురించి చర్చించుకున్నారు. సోనియా త్యాగం చేశారు: డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సదస్సులో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రసంగిస్తూ.. సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆమె ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి చేతి గుర్తుపై పోటీ చేసిన సుమిత్రాదేవి భారీ మెజార్టీతో గెలిచారని.. అప్పుడు ఇందిరాగాంధీ పేరుతో ప్రభంజనం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాల కంటే పార్టీ గొప్పదన్నారు. ప్రతీ కార్యకర్తా పార్టీ కోస శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. సదస్సును జయప్రదం చేసిన కార్యకర్తలకు, నాయకులుకు కృతజ్ఙతలు తెలిపారు. సోనియాకు బహుమతిగా ఇవ్వాలి: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుపొంది.. ఆ విజయాన్ని సోనియాగాంధీ బహుమతిగా ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తా క్షేత్ర స్థాయలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సేనని ప్రజలకు తెలుసన్నారు. ప్లీజ్ ఒక్క ఫొటో.. : మేధోమథన సదస్సు ముగిసిన అనంతరం కళాశాల విద్యార్థులు, పార్టీ కార్యకార్తలు నాయకుతో పోటీ పడి ఫొటోలు దిగారు . నాయకులు సదస్సు ప్రాంగణంలో తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. -
‘చెయ్యి’చ్చారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సుకు పలువురు జిల్లా నేతలు గైర్హాజరవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ, రాష్ర్టస్థాయి అగ్రనేతలు హాజరైన ఈ సదస్సును జిల్లా నేతలు లైట్‌గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాం గ్రెస్ పార్టీ.. తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సును తలపెట్టింది. అయితే జిల్లా నాయకత్వం నుంచి స్పందన కరువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సదస్సులను నిర్వహించాలని, మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సదస్సు ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు అనువైన ప్రాంతంగా జిల్లా ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లకు ఉపక్రమించింది. అయితే జిల్లా నాయకత్వం నుంచి సహకారం లభించకపోవడంతో సదస్సు తొలిరోజే అభాసుపాలైంది. రెండోరోజూ సాదాసీదాగానే కార్యక్రమాలు కొనసాగాయి. కనిపించని అగ్రనేతలు.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనగానే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ హోంమంత్రి సబితారెడ్డి. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వెలుగొందిన సబిత.. తాజా సదస్సుకు దూరం కావడంతో పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే సైతం సదస్సులో కనిపించలేదు. గతంలో జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో హడావుడి చేస్తూ చురుకుగా పాల్గొనే మల్రెడ్డి సోదరులు.. భవిష్యత్ కార్యచరణ సదస్సుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలైన నారాయణరావు, కె.లకా్ష్మరెడ్డి, బి.రాజిరెడ్డి తదితరులు సైతం సదస్సులో పూర్తిస్థాయిలో పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి కూడా పరిమిత పాత్రే పోషించారు. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కార్తీక్‌రెడ్డి రెండోరోజు సదస్సుకు హాజరైనా మౌనముద్ర దాల్చారు. ఇలా ఎవరికివారు గిరి గీసుకుని సదస్సుకు దూరంగా ఉన్నారు. ఇక ముఖ్యనేతలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకుగురయ్యారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ వెనుదిరిగారు. ముదిరిన వర్గపోరు.. జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. డీసీసీ పదవి విషయంలో నెలకొన్న వివాదం, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తదితర అంశాల కారణంగా పార్టీలో తీవ్రమైన అంతర్గత పోరు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఒకే వ్యక్తికి పార్టీ పదవితో పాటు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంపై గొడవ మొదలైంది. దీంతో అధిష్టానం క్యామ మల్లేష్‌ను డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించి.. చేవెళ్ల టికెట్ ఆశించి భంగపడ్డ వెంకటస్వామికి కట్టబెట్టింది. తాజాగా నాలుగు రోజుల క్రితం తిరిగి క్యామకు డీసీసీ పీఠాన్ని అప్పగిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సదస్సు కార్యక్రమాలకు మల్లేష్ నేతృత్వం వహించారు. ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. క్యామకు రెండోసారి అధ్యక్ష పీఠం ఇవ్వడంపై అటు మల్రెడ్డి వర్గం, ఇటు సబిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనేపథ్యంలో టీపీసీసీ తలపెట్టి ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆయా వర్గాలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా పార్టీలోని పలువురు సీనియర్ల సహకారం కరువవ్వడంతో రెండ్రోజుల సమావేశం కాస్తా పేలవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన నేతలు వచ్చినప్పటికీ.. వారిని రిసీవ్ చేసుకునేందుకు స్థానిక నేతలెవరూ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నేతలవద్ద జిల్లా కాంగ్రెస్ ప్రతిష్ట పలుచబడింది. -
కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు రాహుల్?
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న మేధోమథన సదస్సుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజ రయ్యే అవకాశాలున్నాయి. ఈ సదస్సు వేదికకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాల ప్రాంగణాన్ని శుక్రవారం ఆ పార్టీ నేతలు మల్లు రవి, కమలాకర్‌రావు, కోదండరెడ్డి తదితరులు పరిశీలించారు. గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ ముఖ్యనేతలు దిగ్విజయ్‌సింగ్, జయరాం రమేశ్, కొప్పుల రాజు తదితరులు పాల్గొననున్నారు. పార్టీ ఓట మికి కారణాలను సమీక్షించి, పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించనున్నారు.