‘చెయ్యి’చ్చారు! | important leaders skipped Medhomathana Conference | Sakshi
Sakshi News home page

‘చెయ్యి’చ్చారు!

Published Mon, Aug 25 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

important leaders skipped Medhomathana Conference

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీకి పునర్‌వైభవం తెచ్చేందుకు జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సుకు పలువురు జిల్లా నేతలు గైర్హాజరవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ, రాష్ర్టస్థాయి అగ్రనేతలు హాజరైన ఈ సదస్సును జిల్లా నేతలు లైట్‌గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాం గ్రెస్ పార్టీ.. తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సును తలపెట్టింది.

అయితే జిల్లా నాయకత్వం నుంచి స్పందన కరువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సదస్సులను నిర్వహించాలని, మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సదస్సు ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు అనువైన ప్రాంతంగా జిల్లా ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లకు ఉపక్రమించింది. అయితే  జిల్లా నాయకత్వం నుంచి సహకారం లభించకపోవడంతో సదస్సు తొలిరోజే అభాసుపాలైంది. రెండోరోజూ సాదాసీదాగానే కార్యక్రమాలు కొనసాగాయి.

 కనిపించని అగ్రనేతలు..
 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనగానే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ హోంమంత్రి సబితారెడ్డి. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వెలుగొందిన సబిత.. తాజా సదస్సుకు దూరం కావడంతో పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే సైతం సదస్సులో కనిపించలేదు. గతంలో జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో హడావుడి చేస్తూ చురుకుగా పాల్గొనే మల్‌రెడ్డి సోదరులు.. భవిష్యత్ కార్యచరణ సదస్సుపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలైన నారాయణరావు, కె.లకా్ష్మరెడ్డి, బి.రాజిరెడ్డి తదితరులు సైతం సదస్సులో పూర్తిస్థాయిలో పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి కూడా పరిమిత పాత్రే పోషించారు. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కార్తీక్‌రెడ్డి రెండోరోజు సదస్సుకు హాజరైనా మౌనముద్ర దాల్చారు. ఇలా ఎవరికివారు గిరి గీసుకుని సదస్సుకు దూరంగా ఉన్నారు. ఇక ముఖ్యనేతలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకుగురయ్యారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ వెనుదిరిగారు.

 ముదిరిన వర్గపోరు..
 జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. డీసీసీ పదవి విషయంలో నెలకొన్న వివాదం, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తదితర అంశాల కారణంగా పార్టీలో తీవ్రమైన అంతర్గత పోరు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఒకే వ్యక్తికి పార్టీ పదవితో పాటు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంపై గొడవ మొదలైంది. దీంతో అధిష్టానం క్యామ మల్లేష్‌ను డీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించి.. చేవెళ్ల టికెట్ ఆశించి భంగపడ్డ వెంకటస్వామికి కట్టబెట్టింది. తాజాగా నాలుగు రోజుల క్రితం తిరిగి క్యామకు డీసీసీ పీఠాన్ని అప్పగిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సదస్సు కార్యక్రమాలకు మల్లేష్ నేతృత్వం వహించారు.

 ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. క్యామకు రెండోసారి అధ్యక్ష పీఠం ఇవ్వడంపై అటు మల్‌రెడ్డి వర్గం, ఇటు సబిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనేపథ్యంలో టీపీసీసీ తలపెట్టి ‘భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆయా వర్గాలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా పార్టీలోని పలువురు సీనియర్ల సహకారం కరువవ్వడంతో రెండ్రోజుల సమావేశం కాస్తా పేలవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన నేతలు వచ్చినప్పటికీ.. వారిని రిసీవ్ చేసుకునేందుకు స్థానిక నేతలెవరూ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నేతలవద్ద జిల్లా కాంగ్రెస్ ప్రతిష్ట పలుచబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement