ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ సదస్సు సోమవారం ముగిసింది. మండల పరిధిలోని శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కళాశాల ప్రాంగణంలో రెండోరోజు సదస్సు ఉదయం 10:45 నిమిషాలకు ప్రారంభమైంది. మొదటగా మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఐదు రోజులుగా మేధోమథన సదస్సు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులు దానం నాగేందర్, సుధీర్‌రెడ్డి, క్యామ మల్లేష్ తదితరులకు ధన్యవాదాలతో సభ ప్రారంభమయింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సదస్సు ప్రారంభంలో ఉండి అగ్ర నాయకులకు ఆహ్వానం పలికారు.
మేరా దోస్త్ ఆగయా..: సదస్సు ప్రారంభం కాకముందు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి బయట నిలుచున్నప్పుడు అటుగా జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తన కారులో వస్తుండగా అక్కడున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జీవన్‌రెడ్డిని చూస్తూ.. మేరా దోస్త్ ఆగ యా అన్నారు. కారు దిగిన జీవన్‌రెడ్డి.. ఎలా ఉన్నావు దోస్త్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడున్న నాయకులు వారిద్దరి స్నేహం గురించి చర్చించుకున్నారు.
సోనియా త్యాగం చేశారు: డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్
సదస్సులో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రసంగిస్తూ.. సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆమె ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి చేతి గుర్తుపై పోటీ చేసిన సుమిత్రాదేవి భారీ మెజార్టీతో గెలిచారని.. అప్పుడు ఇందిరాగాంధీ పేరుతో ప్రభంజనం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాల కంటే పార్టీ గొప్పదన్నారు. ప్రతీ కార్యకర్తా పార్టీ కోస శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. సదస్సును జయప్రదం చేసిన కార్యకర్తలకు, నాయకులుకు కృతజ్ఙతలు తెలిపారు.
సోనియాకు బహుమతిగా ఇవ్వాలి: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుపొంది.. ఆ విజయాన్ని సోనియాగాంధీ బహుమతిగా ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తా క్షేత్ర స్థాయలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సేనని ప్రజలకు తెలుసన్నారు.
ప్లీజ్ ఒక్క ఫొటో.. : మేధోమథన సదస్సు ముగిసిన అనంతరం కళాశాల విద్యార్థులు, పార్టీ కార్యకార్తలు నాయకుతో పోటీ పడి ఫొటోలు దిగారు . నాయకులు సదస్సు ప్రాంగణంలో తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
ముగిసిన ‘మేధోమథనం’
Published Mon, Aug 25 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement