పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు బ్రేక్
సాక్షి, విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా మెడికల్ కౌన్సెలింగ్ మూడో రోజు శుక్రవారం అర్ధంతరంగా ఆగిపోయింది. పీజీ సీట్లు కే టాయించేందుకు తయారుచేసిన సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఆ తరువాత సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు గుర్తించిన అధికారులు కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక సీట్లు కేటాయించే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగి జాతీయ రహదారిపై వాహనాలను నిలిపేశారు. తమకు న్యాయం చేయాలంటూ వర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అడ్డుకున్నారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం కౌన్సెలింగ్‌ను రద్దుచేసే దిశగా ఆలోచిస్తున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. శనివారంనాటి కౌన్సెలింగ్ ఆదివారానికి వాయిదావేస్తున్నామని, శనివారం ఒక నిర్ణయం తీసుకుంటామని వీసీ ‘సాక్షి’కి తెలిపారు.