ఆరోగ్యమిత్రలకు మద్దతుగా ఉద్యమం
ఈ నెల 28 నుంచి విజయవాడ లెనిన్ సెంటర్లో రిలేదీక్షలు
విజయవాడలోని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయం
విజయవాడ బ్యూరో : ఉద్యోగం కోసం రాష్ట్ర వ్యాపితంగా ఆరోగ్యమిత్రలు చేపట్టిన ఆందోళనకు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్న వైద్యమిత్రుల తొలగింపు దారుణమని, వారికి మద్దతుగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యమిత్రలకు మద్దతుగా జిల్లాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని, జనవరి 28 నుంచి విజయవాడ లెనిన్ సెంటర్లో రిలే దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. అదే విధంగా ఈనెల 25న విజయవాడలో ఆరోగ్యమిత్రలను అక్రమ అరెస్టులు చేసి అర్థరాత్రి వరకు జైలులో ఉంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
వైద్యమిత్ర కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటీయూసీ) ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పిజే చంద్రశేఖర్‌రావు, సీపీఎం రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, యువజన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, బీజేపీ నాయకులు కేఎస్ అరుగమ్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, ఆరోగ్యమిత్ర యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మనోహర్‌మాణిక్యం పాల్గొని మాట్లాడారు.
ఆరోగ్యమిత్రలపై సీఎం హామీ ఇచ్చారు.. సీపీఐ ఎమ్మెల్సీ
విద్యార్హతల పేరుతో ఆరోగ్యమిత్రలను తొలగించేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 28ను పునఃసమీక్షించాలని తాను విజ్ఞప్తి చేయడంతో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సీపీఐ ఎమ్మెల్సీ, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు పీజే చంద్రశేఖరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర వేడుకల్లో సీఎంను కలిసి ఆరోగ్యమిత్రల విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఆరోగ్యమిత్రలు ఆసుపత్రుల్లో రోగులకు సహాయకారిగా ఉంటున్నారని, ఇప్పుడు బీఎస్సీ, నర్సింగ్ ఉద్యోగ అర్హతగా నిర్ణయించడం సరైందికాదని తాను సీఎంకు వివరించానన్నారు. దీనిపై సరైన సమాచారం తీసుకుని ఆరోగ్యమిత్రలకు న్యాయం చేయాలని కోరడంతో తప్పనిసరిగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు తెలిపారు.