చనిపోయేందుకు మందు గోలీ ఇవ్వండి బిడ్డా!
‘అర్హత ఉన్నా.. ఆసరా పింఛన్ రాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. భిక్షాటన చేసేందుకు ఒళ్లు సహకరించడం లేదు.. చనిపోయేందుకు మందు గోలీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి బిడ్డా!’ అంటూ కనపడిన వారందరినీ దీనంగా అడుగుతోంది 80 ఏళ్ల వృద్ధురాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నా.. వృద్ధాప్య పింఛన్‌కు అర్హులరాలైనా.. ఎవరూ కనికరించక పోవడంతో తనను చంపేయండంటూ పరోక్షంగా వేడుకుటోంది.
- ఓ వృద్ధురాలి ఆక్రందనభిక్షాటన చేసేందుకు ఒళ్లు సహకరించ లేదంటూ ఆవేదన
- అర్హత ఉన్నా అందని ఆసరా పింఛన్
- సీఎం నియోజకంలోనే హృదయ విదారకర సంఘటన
కొండపాక: మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటవ్వ (80) భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. దీంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూలీనాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటవ్వకు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.200 పింఛన్ తీసుకునేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పథకం ప్రవేశపెట్టిందన్న విషయం తెలుసుకున్న వెంకటవ్వ నెలకు రూ. 1000 పొందవచ్చని సంతోషపడింది. ఈ పథకానికి అన్ని రకాలుగా అర్హురాలు అయినప్పటికీ వెంకటవ్వకు ప్రభుత్వం పింఛన్‌ను మంజూరు కాలేదు.
దీంతో ఆసరా పథకం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను, ఎంపీడీఓ కార్యాలయ అధికారులను వేడుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కనికరించకపోవడంతో ఆసరాకు నోచుకోలేకపోయింది. చివరకు ఆసరా రాదనుకున్న వెంకటవ్వ రోడ్డున వెళ్లే వారి వద్ద, గ్రామస్తుల వద్ద భిక్షాటన చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. భిక్షం అడుక్కునే ముందు ఎవరైనా చనిపోయేందుకు ఒక మందు గోలీ ఇవ్వండి బిడ్డా అంటూ దీనంగా వేడుకుంటోంది.