మెడ్‌టెక్ పార్కులో... అవినీతి చెట్లు
రూ.1,733 కోట్లు కాజేసేందుకు వ్యూహం
- అంచనా వ్యయం రూ.709 కోట్ల నుంచి రూ.2,432 కోట్లకు పెంపు
విశాఖపట్నం జిల్లా మెడ్‌టెక్ జోన్ పార్కు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ పార్కులో అవినీతి మొక్కలు చెట్లుగా మారాయి. ప్రహరీ కూడా పూర్తి కాకముందే వందలాది కోట్లు కాజేసేందుకు మంత్రాంగం పూర్తయింది. కేబినెట్ అనుమతి లేకుండానే రాత్రికి రాత్రి అంచనాలు పెంచేశారు. కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.1733 కోట్లు జేబులో వేసుకునేందుకు పక్కా వ్యూహం రచించారు. కాదు కూడదన్న డైరెక్టర్లకు శంకరగిరి మాన్యాలు చూపిం చారు. ఇలాగైతే ఎలా అంటూ వాస్తవాన్ని నివేదించిన వారిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. ఎవరేమనుకున్నా ఫరవాలేదనుకుని బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. మీడియాకు సమాచారమిచ్చారనే కారణంతో ఓ డైరెక్టర్‌ను ఏకంగా అరెస్టు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతోందో.. ప్రభుత్వ పెద్దల లక్ష్యం, దశ, దిశ ఏమిటనేది ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ ముఖ్య నేత, ఆయన తనయుడి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని ప్రభుత్వ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆరోగ్య శాఖ సలహాదారు ముందుండి ఈ తతంగాన్ని నడిపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్య ఉపకరణాల ఖరీదు చాలా ఎక్కువగా ఉందని, వాటిని ఇక్కడే తయారు చేసి తక్కువ ధరకు పేదలకు అందించాలని విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలంలో స్టీల్ ప్లాంట్ ఎదురుగా 270 ఎకరాలు మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్ – ఆంధ్రా మెడికల్ టెక్నాలజీ జోన్)కు కేటాయించారు. గతేడాది ఈ ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలి మెడికల్ టెక్నాలజీ పార్కు అని, ఇది భారతదేశానికే తలమానికమని ప్రభుత్వం బాగా ప్రచారం చేసుకుంది. ఈ సంస్థకు ఉత్తరాదికి చెందిన జితేందర్ కుమార్ శర్మ అనే ఓ ప్రైవేటు కన్సల్టెంట్‌ను సీఈఓగా నియమించారు.
ఇతను వైద్య ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి చెల్లెలు భర్తకు సన్నిహితుడని ప్రచారం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను తయారు చేసే బాధ్యత కేపీఎంజీ అనే ప్రముఖ సంస్థకు అప్పజెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.709 కోట్లు వ్యయం అవుతుందని ఆ సంస్థ నివేదించింది. ఇందులో రూ.500 కోట్లు అభివృద్ధి పనులకు, రూ.200 కోట్లు మౌలిక సదుపాయాలకు, మిగతా రూ.9 కోట్లు ఇతర పనులకు వెచ్చించాలని వివరించింది.
ఊహకందని రీతిలో అంచనాల పెంపు
విశాఖ స్టీల్ సిటీ ఎదురుగా ఉన్న స్థలాన్ని మెడ్‌టెక్ పార్కుకు కేటాయించారు. అనుకున్న మేరకు నిధులతో ప్రాజెక్టు పూర్తి చేయడం వీలుకానప్పుడు ఐదు లేదా పది శాతం అంచనాలను పెంచుకోవడం మామూలే. అలాంటిది ప్రభుత్వ పెద్దలు మరో రకంగా ఆలోచించారు. అవకాశం ఉంది కదా అని ఏకంగా 350 శాతం అంచనాలను పెంచేశారు. రూ.709 కోట్లు ఉన్న అంచనా వ్యయాన్ని రూ.2,432 కోట్లకు పెంచి.. రూ.1733 కోట్లు జేబులో వేసుకునేందుకు పథక రచన చేశారు. ఇందులో భాగంగా కేటగిరీ 1లో 11 శాతం స్థలంలో ఆర్సీసీ కన్స్ట్రక్షన్కు చదరపు అడుగు అభివృద్ధికి రూ.1200 కేటాయించొచ్చని కేపీఎంజీ చెబితే దానిని ఏకంగా రూ.6,081కు పెంచారు. 27 శాతం స్థలం అభివృద్ధికి చదరపు అడుగుకు రూ.250 కేటాయించాలని చెబితే.. దానిని రూ.1596.6 చేశారు. మూడవ కేటగిరి కింద 62 శాతం స్థలంలో షెడ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.640 చొప్పున ఇవ్వాలని చెబితే.. ఏకంగా రూ.1,579గా మార్చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు మెడ్‌టెక్ సీఈఓ రాత్రికి రాత్రే ఇలా అంచనాలు పెంచేసి నిబంధనలకు విరుద్ధంగా వారికి లబ్ధి కలిగించడానికి పూనుకున్నారు. దీంతో అంచనా వ్యయం రూ.2,460 కోట్లకు పెరిగింది. కనీసం మంత్రివర్గ అనుమతి కూడా లేకుండా మెడ్‌టెక్ జోన్ పార్క్ సీఈఓ నేరుగా ప్రభుత్వ ముఖ్య నేతతో మాట్లాడుకుని అంచనాలు పెంచేసినట్టు స్పష్టమవుతోంది.
టెండర్ల దశలోనే మాయాజాలం
మెడ్‌టెక్ జోన్ పార్కు టెండర్ల దశలోనే అవినీతికి బీజం పడింది. అభివృద్ధి పనులకు మొత్తం 11 కంపెనీలు వస్తే అందులో 9 కంపెనీలను తొలిదశలోనే ఇంటికి పంపించేశారు. మిగిలిన రెండు కంపెనీలు.. ల్యాంకో ఇన్ఫ్రా, ఎన్సీసీ. ఈ రెండింటిలో ల్యాంకో ఇన్ఫ్రా ఎల్1గా వచ్చింది. ఈ కంపెనీ ఇప్పటికే డీఫాల్ట్ కంపెనీగా బ్లాక్ లిస్టులో ఉంది. ఆర్థిక బిడ్ల దశలో బ్యాంకు నుంచి ఇవ్వాల్సిన సాల్వేషన్ సర్టిఫికెట్ కూడా ఈ కంపెనీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో దీనిపై అనర్హత వేటు వేయాల్సింది పోయి, దీనికే పట్టం కట్టారు. డీఫాల్ట్ కంపెనీకి పనులు కట్టబెట్టడంపై ప్రశ్నించాల్సిన ఎన్సీసీ కంపెనీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఈ కంపెనీని కూడా మాట్లాడకుండా మేనేజ్ చేసి మెడ్‌టెక్ పనులను ల్యాంకోకు నజరానాగా అప్పజెప్పారు.
ఫిర్యాదు చేసిన వారిపైనే చర్యలు
మెడ్‌టెక్ జోన్ పార్కులో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు 2017 మార్చి 8వ తేదీన అప్పటి వైస్ ప్రెసిడెంట్లు, మేనేజర్లు జుడీష్ రాజు (వైస్ ప్రెసిడెంట్ – ప్లానింగ్), షిబా దత్తా మిస్త్రీ (వైస్ ప్రెసిడెంట్ – ఆపరేషన్స్), డా.నిరంజన్ జోషి (వైస్ ప్రెసిడెంట్ – టెక్నికల్), సోహాన్ దత్తా (సీనియర్ మేనేజర్ – మార్కెటింగ్), గంభీర్ జైన్ (సీనియర్ మేనేజర్ – ఫైనాన్స్), అమృతా దత్తా (మేనేజర్ – టెక్నికల్), నికిన్ జైన్ (మేనేజర్ – మార్కెటింగ్, ఐటీ)లు లేఖ రాశారు. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కోట్లు వెళుతున్నాయని లేఖలో వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సదరు ఉన్నతాధికారి అలా చేయకపోగా ఎవరైతే లేఖ రాశారో వారిని ఉద్యోగం నుంచి ఊడపీకేయించారు.
సీఈఓ జితేంద్రశర్మకు వీళ్లెవరూ నచ్చడం లేదన్న ఉద్దేశ్యంతో వారిని పదవుల నుంచి తొలగించినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. మెడ్‌టెక్ జోన్ పార్కులో అవినీతి జరుగుతోందని, ఇందులో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు ఆగస్టు 2వ తేదీన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ వైస్ ప్రెసిడెంట్ జుడీష్‌రాజు ఒకరు. మీడియాకు సమాచారమిచ్చారన్న అక్కసుతో ఇతనిపై విశాఖపట్నం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మెడ్‌టెక్ జోన్ ఉద్యోగి ఒకరు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను శనివారం అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకెళ్లారు. మరికొంత మంది ఉద్యో గులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెడ్‌టెక్ జోన్ సీఈఓ పేరిట నకిలీ ఈ మెయిల్ సృష్టించి సమాచారాన్ని ఇతరులకు చేరవేశారన్న అభియోగంతో వీరిపై కేసులు నమోదు చేశారు. కాగా, మెడ్‌టెక్ జోన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఒక్కొక్కటే బయటకు రావడంతో ఈ నెల 2వ తేదీ రాత్రి సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో పలు మార్పులు చేశారు. భారీగా పెంచిన అంచనాలను ఒక్కసారిగా తగ్గిస్తూ కొత్త సమాచారాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. విషయం బయటకు పొక్కడంతోనే ఇలా చేశారని సంబంధిత ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
మోసం చేసినందుకే..
సాక్షి, విశాఖపట్నం: మెడ్‌టెక్ కంపెనీని మోసం చేసినందుకే వైస్ ప్రెసిడెంట్‌తో పాటు మరికొందరిని మార్చిలోనే విధుల నుంచి తొలగించారని విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షికి ఫోన్లో తెలిపారు. మెడ్‌టెక్ సీఈఓ పేరిట ఐడీ క్రియేట్ చేసి సుమారు 800 కంపెనీలకు తప్పుడు ఈ మెయిల్స్ చేశారని, కంపెనీ సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి.. వైస్ ప్రెíసిడెంట్ జుడిస్ రాజ్‌ను అరెస్ట్ చేసి విశాఖకు తీసుకొస్తున్నారని తెలిపారు.
–కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
20 వేల ఉద్యోగాలు ఎక్కడ?
విశాఖలో వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలు వస్తే ప్రత్యక్షంగా 20 వేల ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భారీగా ప్రచారం నిర్వహించింది. కానీ సంస్థ సీఈఓ తెచ్చిన 11 సంస్థల్లో ఇప్పటికే 5 సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి. ఉన్న ఆరు సంస్థలు కూడా చోటా మోటా కంపెనీలని, వీటికి మార్కెట్లో అంతగా పేరులేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రహరీ కూడా పూర్తి కాలేదు.. ఇక ఉద్యోగాలెక్కడ ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మెడ్‌టెక్ జోన్‌కు పరిశ్రమలను ఆకర్షించే పేరుతో సీఈఓ జితేందర్ కుమార్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యలు పలు దేశాలు తిరిగొచ్చారు. కానీ పరిశ్రమలు మాత్రం రాలేదు. రెండేళ్లలో జితేందర్ శర్మ ఆరు సార్లు, పూనం మాలకొండయ్య ఐదుమార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఇందులో అమెరికా, జర్మనీ, చైనా, సింగపూర్ దేశాలు ఉన్నాయి. ఈ పర్యటనలకు ఇప్పటి వరకు రూ.30 లక్షలకు పైనే ఖర్చు అయినట్లు తెలిసింది.