ఇలాంటి భోజనం ఎలా తినాలి?
– ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన
యూనివర్సిటీ క్యాంపస్:నాణ్యత, శుచి శుభ్రత లేని భోజనం ఎలా తినాలని ఎస్వీయూ హాస్టల్ విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్వీయూలోని బీ–మెస్‌లో భోజనం బాగాలేదని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ప్లేట్లు చేతిలో పెట్టుకుని బీ–మెస్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ మెస్‌లో భోజనం చాలా అధ్వాన్నంగా వుందన్నారు. నీళ ్లచెట్నీ, సాంబారుతో తినలేక పోతున్నామని విమర్శించారు. ఫీజులు మాత్రం అధిక మొత్తంలో వసూలుచేసుకుని నాణ్యతలేని భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. భోజనం వడ్డించే సిబ్బంది కూడా తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుల్‌రెడ్డి, బీజేపీ ఎడ్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులు మురళీధర్ విద్యార్థులకు మద్దతు తెలిపారు. నాణ్యమైన అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు విద్యార్థులతో చర్చించారు. రెండు రోజుల్లో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.