చిన్నారుల ఉసురు తీసిన 'మధ్యాహ్న భోజనం'
దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది చిన్నారులను బడిబాట పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రారంభం నాటి నుంచి ఆ పథకం అమలు తీరు లోపాల పుట్టగా మారిందని అటు స్వపక్షం, ఇటు విపక్షంలోని సభ్యులు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. అయిన ప్రభుత్వం తన మొద్దు నిద్రను విడలేదు. ప్రభుత్వ మొద్దు నిద్రకు 23 మంది చిన్నారులు శాశ్వత నిద్రలోకి నెట్టిసింది. మరో 30 మంది చిన్నారులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు.
అత్యంత హృదయవిధారకరమైన సంఘటన బీహార్ శరన్ జిల్లా చాప్రా డివిజన్లోని గందమయి దర్మసత్ గ్రామ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జులైలో చోటు చేసుకున్న ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డించిన ఆహారంలో విషతుల్యం కావడంతో పెద్ద సంఖ్యలో చిన్నారులు మరణించారు. మరికొంత మంది అనారోగ్యం పాలైయ్యారు. దాంతో స్థానిక ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. అనారోగ్యం పాలైన చిన్నారులను వెంటనే పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
ఆ దుర్ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాయి. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనాదేవి, ఆమె భర్త అర్జున్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డిస్తున్న ఆహారం ఆధ్వాన్నంగా ఉందని విద్యార్థులు ఇంటి వద్ద మొత్తుకుంటున్నారని వారి తల్లిదండ్రులు స్థానిక అధికారుల వద్ద చెవిన ఇల్లుకట్టుకుని పోరారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించాల్సిన సరకులన్నింటిని మీనాదేవి భర్త అర్జున్ రాయ్ కొనుగోలు చేసి పలు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనా దేవి భర్త రాజకీయ పలకుబడి కారణంగా ఆయనపై చర్యల తీసుకునేందుకు అధికారులు వెనకడుగేశారు. దాంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో క్రిమిసంహారక మందులకు సంబంధించిన అనవాళ్లు ఉన్నాయని ఆహార పరీక్ష నివేదికలో నిగ్గుతేలింది. ఆ దుర్ఘటనలో మరణించిన విద్యార్థులు ఒకొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని నితీష్ ప్రభుత్వ ప్రకటించింది.
శరన్ ఎంపీ, మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ ఘటనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నితీష్ ప్రభుత్వం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని లాలూ పేర్కొన్నారు.