'ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటాం'
► ‘ఆరెపల్లి’కి కార్యకర్తల బాసట
►నియోజకవర్గ ముఖ్యులతో సమావేశం
► వర్గపోరు, షోకాజ్‌పై అభిప్రాయ సేకరణ
కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, గతనెల 30న డీసీసీ సమావేశంలో జరిగిన గొడవ విషయంలో షోకాజ్ నోటీసుల వ్యవహారంపై మంగళవారం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఇంట్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయంతో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను వారికి చూపించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ డీసీసీ కార్యాలయంలో జరిగిన గొడవ విషయంలో ఏకపక్షంగా పీసీసీ కమిటీ షోకాజ్ నోటీసుజారీ చేసిందని, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పని చేస్తే ఇదేనా గౌరవం అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరుతో అసలు నెగ్గగలమా..పార్టీ మారితే లాభనష్టాలేమిటి అనే అంశాలపై పలువురు కార్యకర్తలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు ఆ పార్టీలో చేరితే ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నించినట్లు వినికిడి. టీఆర్ఎస్లో చేరితే అక్కడ ఎలాంటి ఆ గౌరవం దక్కుతుందో ఊహించుకోవచ్చునని పలువురు వాపోయినట్లు సమాచారం. చివరగా ఆరెపల్లి మోహన్ ఈనెల 17న గాంధీభవన్‌కు వెళ్లి షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చి వస్తాను.. తర్వాత జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని కార్యకర్తలకు సూచించినట్లు తెలిసింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని నాయకులు, కార్యకర్తలు ఆయనకు బాసటగా నిలిచినట్లు సమాచారం.
పార్టీని వీడేది లేదు -ఆరెపల్లి మోహన్
తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆరెపల్లి మోహన్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎన్ఎస్యుఐ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఈ స్థారుుకి ఎదిగానన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఈనెల 17న సమాధానం ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని తెలిపారు. పార్టీ మారే విషయంపై జరుగుతున్న ప్రచారం అవాస్తమని కొట్టిపారేశారు.