in meeting
-
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిం చాలని సూచించారు. పార్టీ పటిష్టానికి గ్రామ, బూత్‌స్థాయిలో కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు కోరుతూ ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జి పిల్లి సుభాస్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, సమన్వయకర్తలు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాసు, తానేటి వనిత, తలారి వెంకట్రావు, మేకా శేషుబాబు, ఎస్.రాజీవ్‌కృష్ణ హాజరయ్యారు. -
హాస్టళ్ల తనిఖీకి ప్రత్యేకాధికారులు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, హాస్టల్స్‌ను మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు 47 మంది ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి అధికారి హాస్టల్లో రాత్రిపూట మకాం చేసి విద్యార్థులతో మమేకం కావాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 173 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయని, ఈ హాస్టల్స్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు సక్రమంగా భోజనాలు పెడుతున్నారా? హాస్టల్స్‌లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించామని, ఆ అధికారులంతా ప్రతివారం హాస్టల్స్‌ను తనిఖీ చేయాలని కలెక్టర్ చెప్పారు. క్రమశిక్షణతో విద్యాబోధన సాగిస్తే హాస్టల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధించగలుగుతారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 430 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు, ఆన్లైన్ ఫైలింగ్ విధానం మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ మాణిక్యం, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, డ్వామా పీడీ ఎం.వెంకట రమణ, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాస్, డీపీవో సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు -
శివారు ప్రాంత భూములకు సాగునీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని శివారు ప్రాంత భూములకు కూడా తరలించాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఈఈ జి.శ్రీనివాసరావును ఆదేశించారు. కలెక్టరేట్లో వర్షాభావ పరిస్థితులపై ఇరిగేషన్ వ్యవసాయ, భూగర్భజల శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురవకపోవడంతో శివారు ప్రాంత భూములకు నీరందక మెట్ట ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడంతో కొన్ని చోట్ల పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. లింగపాలెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, నరసాపురం శివారు ప్రాంతాల్లోని భూములకు సేద్యపు నీరు సక్రమంగా అందక పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి ఎక్కడా కూడా ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా రాబోయే 40 రోజులు తక్షణ పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, భూగర్భజల శాఖ డీడీ రంగారావు పాల్గొన్నారు. హార్టీకల్చర్ హబ్‌కు అధికారుల సహకారం లేదు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంటే దీనికి అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. అధికారుల తీరులో మార్పురాకుంటే వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలున్నాయని, రైతు ఏ రకం తోటలు పెంచుతున్నాడో డేటాబేస్‌లో పొందుపరచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఐదు నెలల్లో కేవలం 6,700 ఎకరాలు మాత్రమే ఆన్లైన్ చేశారని, సమగ్ర డేటాబేస్ ఎప్పటికి సిద్ధమవుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. గతంలో ఉద్యానశాఖకు ఒక్క ఏడీ ఉన్నప్పుడే పనులు బాగా జరిగేవని ప్రస్తుతం ఒక డీడీ, ఇద్దరు ఏడీలు నియమితులైన తరువాత ప్రగతి శూన్యంగా కనిపిస్తోందన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ డీడీ వైవీఎస్ ప్రసాద్, ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దుర్గేష్, విజయలక్ష్మి, ఏపీఎంఐసీ పీడీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు.