శివారు ప్రాంత భూములకు సాగునీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని శివారు ప్రాంత భూములకు కూడా తరలించాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఈఈ జి.శ్రీనివాసరావును ఆదేశించారు. కలెక్టరేట్‌లో వర్షాభావ పరిస్థితులపై ఇరిగేషన్ వ్యవసాయ, భూగర్భజల శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురవకపోవడంతో శివారు ప్రాంత భూములకు నీరందక మెట్ట ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడంతో కొన్ని చోట్ల పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. లింగపాలెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, నరసాపురం శివారు ప్రాంతాల్లోని భూములకు సేద్యపు నీరు సక్రమంగా అందక పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి ఎక్కడా కూడా ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా రాబోయే 40 రోజులు తక్షణ పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, భూగర్భజల శాఖ డీడీ రంగారావు పాల్గొన్నారు.
హార్టీకల్చర్ హబ్‌కు అధికారుల సహకారం లేదు
జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంటే దీనికి అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. అధికారుల తీరులో మార్పురాకుంటే వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలున్నాయని, రైతు ఏ రకం తోటలు పెంచుతున్నాడో డేటాబేస్‌లో పొందుపరచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఐదు నెలల్లో కేవలం 6,700 ఎకరాలు మాత్రమే ఆన్‌లైన్ చేశారని, సమగ్ర డేటాబేస్ ఎప్పటికి సిద్ధమవుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. గతంలో ఉద్యానశాఖకు ఒక్క ఏడీ ఉన్నప్పుడే పనులు బాగా జరిగేవని ప్రస్తుతం ఒక డీడీ, ఇద్దరు ఏడీలు నియమితులైన తరువాత ప్రగతి శూన్యంగా కనిపిస్తోందన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ డీడీ వైవీఎస్ ప్రసాద్, ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దుర్గేష్, విజయలక్ష్మి, ఏపీఎంఐసీ పీడీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు.