27 దాకా అసెంబ్లీ
♦ 13న బడ్జెట్.. 14న సెలవు
♦ 15 నుంచి 17 వరకు బడ్జెట్‌పై చర్చ
♦ సభ ఆఖరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
♦ బీఏసీ భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు (మొత్తంగా 14 రోజులు) జరగనున్నాయి. శుక్రవారం సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సభ శనివారానికి వాయిదా పడిన అనంతరం స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీడీపీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హాజరయ్యారు. అసెంబ్లీ పని దినాలపై ఇందులో చర్చించారు.
ఈ నెల 27 వరకు సమావేశాలు జరగనుండగా.. 13న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 14న సభకు సెలవు ప్రకటించారు. 15 నుంచి 17 వరకు బడ్జెట్‌పై చర్చ జరగనుంది. రెండ్రోజుల పాటు సాధారణ చర్చ జరిపి బడ్జెట్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు 17వ తేదీన ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. ఈ నెల 25 వరకే సమావేశాలు జరపాలని ముందు భావించినా, బీఏసీ సమావేశంలో సమావేశాల పనిదినాలు పెంచాలని విపక్షాలు కోరడంతో 27 వరకు పొడిగించారు. దీంతో ఆఖరి రోజైన 27నే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమో దం తెలపనున్నారు. 12, 14, 19, 26 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉంటాయి. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఒక్క రోజులో నే చర్చను ముగించడానికి వీలుగా రెండు పూటలా సభను జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కా>గా, 11, 13వ తేదీల్లో ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించలేదు.
మండలి పది రోజులు
శాసన మండలి సమా వేశాలు మొత్తం 10 పనిదినాల పాటు (శుక్రవారం ఒకరోజు పూర్తయ్యింది) కొనసాగనున్నాయి. సెలవు రోజులు పోను మండలి తొలి విడతగా ఈ నెల 17 దాకా నడవనుంది. ఆ తర్వాత తిరిగి 24 నుంచి 27 వరకు మండలి సమావేశాలు జరుగుతాయి.
అడిగినన్ని రోజులు సభ: హరీశ్
ప్రతిపక్షాలు ఎన్ని రోజులు నడపమంటే అన్ని రోజులు సభను నడుపుతామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన తన చాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘సభను 25వ తేదీ వరకు నడుపుదామని అనుకున్నాం. బీఏసీలో చర్చించాక 27వ తేదీ వరకు పెంచాం. సీఎల్పీ నేత జానారెడ్డి అయితే రాత్రి వరకు వరకు సభ పెట్టొద్దని, సాయంత్రంలోగా ముగించమని కోరారు. జీరో అవర్ ఉండాలా, లేదా అనేది చర్చించ లేదు.
సభ్యులు అడిగితే పరిశీలిస్తాం..’’అని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్వేపైనా మంత్రి హరీశ్ స్పందించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్న అంశంపైనే పనితీరును చూశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పనితీరు సరిగా లేకపోవడానికి కారణం.. ఆయన ఎల్పీనగర్ను వదిలిపెట్టి ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ఎక్కువ ఉండడమే కారణమని విశ్లేషించారు. భూ సేకరణ చట్టానికి కేంద్రం ఆమోదానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
1.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో కలసి వస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్
2.లక్ష్మణ్ తో కలసి వస్తున్న బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
3.అసెంబ్లీకి వస్తున్న మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్